కార్తీక పౌర్ణమి వేళ తమిళనాడులోని తిరువణ్ణామలై శివనామస్మరణతో మారుమోగుతోంది. శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న కార్తీక దీపోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా పదో రోజైన మంగళవారం(నవంబర్ 24) తెల్లవారుజామున 4 గంటలకు భరణి దీపాన్ని వెలిగించగా.. సాయంత్రం 6 గంటలకు అరుణాచల గిరి శిఖరంపై మహాదీపం వెలిగించనున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు అరుణాచలానికి చేరుకుంటున్నారు.
కార్తీకపౌర్ణమి సందర్బంగా తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదో రోజైన ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు ఆలయంలో భరణి దీపాన్ని వెలిగించారు. ‘ఏకమ్ అనేకంగా మారే’ తత్వాన్ని చాటుతూ గర్భగుడిలో వెలిగించిన జ్యోతితో ఐదు ప్రమిదల్లో నెయ్యి పోసి దీపాలను వెలిగించారు.
అనంతరం శివాచార్యులు ఈ జ్యోతిని ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి, వినాయక, సుబ్రహ్మణ్య స్వామి సన్నిధులతో పాటు ఇతర ఉపాలయాలకు తీసుకెళ్లి దీపాలు వెలిగించారు. భరణి దీప దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ‘అన్నామలైయార్కు అరోహరా’ అంటూ భక్తి నినాదాలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
ఇదిలా ఉండగా.. కార్తీక దీపోత్సవాల్లో అత్యంత ప్రధానమైన మహాదీపాన్ని ఇవాళ (మంగళవారం)సాయంత్రం 6 గంటలకు అరుణాచల గిరి శిఖరంపై వెలిగించనున్నారు. 2,668 అడుగుల ఎత్తైన కొండపై ఏర్పాటు చేసిన దీపపు కొప్పెరలో 4వేల500 కిలోల నెయ్యి, 1వెయ్యి500 మీటర్ల కాటన్ వత్తులతో మహాదీపాన్ని వెలిగించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల సందర్భంగా 15వేల 500 మంది పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.
