ప్రియురాలిని హత్య చేసిన టెకీ..రాత్రంతా మృతదేహం పక్కన కూర్చుని..ఉదయం పోలీసులకు ఫోన్

ప్రియురాలిని హత్య చేసిన టెకీ..రాత్రంతా మృతదేహం పక్కన కూర్చుని..ఉదయం పోలీసులకు ఫోన్

పూణె: మహారాష్ట్రలోని పూణెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న భాగస్వామినే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఇద్దరి మధ్య జరిగిన గొడవ తీవ్రరూపం దాల్చడంతో ప్రియురాలిపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం రాత్రంతా ఆమె మృతదేహం పక్కనే గడిపిన నిందితుడు, మరుసటి రోజు ఉదయం అంబులెన్స్ కోసం పోలీసులకు ఫోన్ చేయడం కలకలం రేపుతోంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూణెలోని ఐటీ హబ్ హింజవాడిలో ఉన్న ప్రిస్టీన్ పీజీలో నవంబర్ 22  రాత్రి ఈ ఘటన జరిగింది. మృతురాలిని వార్ధా జిల్లాకు చెందిన కోమల్ దహలేగా, నిందితుడిని బుల్ధానా జిల్లాకు చెందిన శుభం కల్బండేగా గుర్తించారు. వీరిద్దరూ హింజవాడిలోని ప్రముఖ ఐటీ సంస్థల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. శుభం ఇన్ఫోసిస్‌లో, కోమల్ విప్రోలో ఉద్యోగం చేస్తున్నారు. వృత్తిపరంగా పరిచయమైన వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత రెండు, మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకూ తెలిసి ఉండటంతో పెళ్లికి కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం.

అయితే శుభంకు మరో మహిళతో సంబంధం ఉందని కోమల్ అనుమానించడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరూ ఓ హోటల్‌కు డిన్నర్‌కు వెళ్లి తిరిగి కోమల్ ఉంటున్న పీజీ గదికి చేరుకున్నారు.

పిడిగుద్దులతో దాడి.. ప్రాణాలు కోల్పోయిన యువతి

అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ గొడవ తెల్లవారుజామున 3 గంటల సమయంలో తీవ్రరూపం దాల్చింది. ఆగ్రహానికి గురైన శుభం కోమల్‌పై పలుమార్లు పిడిగుద్దులతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

రాత్రంతా మృతదేహం పక్కనే.. ఉదయం పోలీసులకు ఫోన్

కోమల్ మరణించినప్పటికీ శుభం రాత్రంతా ఆమె మృతదేహం పక్కనే ఉన్నాడు. ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో పోలీసులకు ఫోన్ చేసి అంబులెన్స్ పంపించాలని కోరాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కోమల్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసుల విచారణలో కోమల్ హత్యకు గురైనట్లు నిర్ధారణ కావడంతో శుభంను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రదీప్ జాదవ్ వెల్లడించారు.