సూర్యాపేట: జిల్లా పోలీస్ శాఖలో అక్రమాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఖాకీ యూనిఫాం అడ్డుపెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడిన పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటూ శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. తాజాగా సూర్యాపేట పట్టణానికి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది.
సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు శ్రీను, కిరణ్ వాహన తనిఖీల పేరుతో స్క్రాప్ వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టగా, వ్యాపారుల నుంచి రూ.21 వేల వరకు వసూలు చేసిన విషయం నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో అక్రమ వసూళ్లకు పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.మరోవైపు హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్లెట్ బైక్ మిస్సింగ్ కేసుకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం, వ్యవహారశైలిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎస్ఐ నరేష్‌పై కూడా సస్పెన్షన్ వేటు పడింది.
ALSO READ : ప్రొటోకాల్ పదవి ఇవ్వండి..కొత్త ఇన్‌చార్జ్ సందీప్‌కు డీసీసీ అధ్యక్షుల వినతి
జిల్లా పోలీస్ శాఖలో అవినీతి, అక్రమ వసూళ్లు, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని ఎస్పీ నరసింహా స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనే విధంగా వరుస చర్యలు చేపడుతున్నారు.
