ప్రొటోకాల్ పదవి ఇవ్వండి..కొత్త ఇన్‌‌‌‌చార్జ్ సందీప్‌‌‌‌కు డీసీసీ అధ్యక్షుల వినతి

ప్రొటోకాల్ పదవి ఇవ్వండి..కొత్త ఇన్‌‌‌‌చార్జ్ సందీప్‌‌‌‌కు డీసీసీ అధ్యక్షుల వినతి

హైదరాబాద్, వెలుగు: జిల్లా స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కమిటీ చైర్మన్లుగా డీసీసీ అధ్యక్షులను నియమించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌‌‌‌చార్జ్‌‌ బీఎం సందీప్‌‌‌‌కు పార్టీ జిల్లా అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. సోమవారం గాంధీ భవన్‌‌‌‌లో సందీప్‌‌‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కర్నాటకలో అమలు చేస్తున్న విధంగానే తెలంగాణలోనూ తమకు ఈ పదవులు ఇస్తే పార్టీతోపాటు ప్రభుత్వంలోనూ తగిన గుర్తింపు, ప్రోటోకాల్ లభిస్తుందని కోరారు.

అంతకుముందు హైదరాబాద్‌‌‌‌లోని ఓ హోటల్‌‌‌‌లో సమావేశమైన డీసీసీ అధ్యక్షులు జిల్లాల్లో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను చర్చించారు. పార్టీ హైకమాండ్ జిల్లా స్థాయిలో డీసీసీ అధ్యక్షులదే కీలక బాధ్యత అని చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాల అమలు కమిటీ చైర్మన్ పదవులు ఇస్తే గౌరవం, గుర్తింపు ఉంటుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు గాంధీ భవన్‌‌‌‌లో డీసీసీ అధ్యక్షులతో విడివిడిగా భేటీ అయిన సందీప్.. మండల కమిటీల నియామకం, గ్రామ కమిటీల ఏర్పాటు పురోగతిపై ఆరా తీశారు.