తెలంగాణ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి శోభ.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు..

తెలంగాణ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి శోభ.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు..

హైదరాబాద్: కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా శివ, వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగగా.. ఎక్కడ చూసినా కార్తీక దీపాల వెలుగులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. భక్తులు దీపాలు వెలిగించి, మొక్కులు చెల్లించుకుంటూ స్వామివారిని దర్శించుకున్నారు.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 శివాలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది.

బోడుప్పల్‌లో కార్తీక దీపాల వెలుగులు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని ఎన్‌ఐఎన్ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర శివాంజనేయ ఆలయం కార్తీక దీపాలతో భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొన్నట్లు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తెలిపారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. తమకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ముడుపు కట్టి పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామివారిని ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశం, రాష్ట్రం, తమ కాలనీ సుభిక్షంగా ఉండాలని, ప్రజల కష్టాలు తొలగిపోవాలని భగవంతుడిని ప్రార్థించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

వర్గల్ శంభు లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శివనామస్మరణ, దీపారాధనలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

హుజూరాబాద్ ఆలయాల్లో భక్తుల సందడి

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. స్థానిక శివాలయంతో పాటు శ్రీ రామచంద్రస్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాళేశ్వరం త్రివేణి సంగమానికి భక్తుల తాకిడి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. వేకువజాము నుంచే కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో త్రివేణి సంగమం జనసంద్రమైంది. పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.

ఓరుగల్లు ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి

వరంగల్ ప్రాంతంలోని వేయి స్తంభాల గుడి, సిద్దేశ్వరాలయం, ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం, పాలకుర్తి శ్రీ సోమేశ్వర ఆలయంలోనూ కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. రుద్రేశ్వరుడికి సామూహిక రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరి, తులసి చెట్ల ముందు దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ వైభవంగా వేడుకలు

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివనామస్మరణతో శివాలయాలు మారుమోగగా, ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు కొనసాగాయి. ఆలయాలన్నీ దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక కళను సంతరించుకున్నాయి.మొత్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ భక్తజన సందోహంతో కళకళలాడాయి. భక్తులు ఉపవాసాలు, దీపారాధనలు, ప్రత్యేక పూజలతో పరమశివుడిని ఆరాధిస్తూ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.