కంగ్టి, వెలుగు: ఆరుగాలం కష్టపడి పండించిన సోయా పంటకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడంతో సుమారు 120 క్వింటాళ్ల సోయా బూడిదపాలైన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్క వడగావ్ లో జరిగింది. గ్రామానికి చెందిన కౌలు రైతు అశోక్ 8 ఎకరాల్లో సోయా పంట సాగు చేశాడు. చేతికొచ్చిన పంటను కోసి కుప్పగా నిల్వ ఉంచాడు.
ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పంట కుప్పకు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు రైతుకు సమాచారం అందించగా, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పంట మొత్తం కాలిపోయి బూడిదైంది. సుమారు 120 క్వింటాళ్ల సోయా పంట కాలిపోవడంతో రూ.8 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు అశోక్ ఆవేదన వ్యక్తం చేశాడు. పంటకు నిప్పు పెట్టిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
