మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. ఢిల్లీ లాయర్ అరెస్ట్

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. ఢిల్లీ లాయర్ అరెస్ట్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహాదేశ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్  కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మురంగా సాగుతోంది. తాజాగా ఈ కేసులో ఢిల్లీకి చెందిన  ఓ లాయర్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దుబాయ్ కి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఢిల్లీ లాయర్ హిమాన్షు శేఖర్  అలియాస్ మోహిత్ ను  ముంబై ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు.  వివరాల్లోకి వెళితే.. 

మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది. ఢిల్లీకి చెందిన లాయర్ హిమాన్షు శేఖర్ అలియాస్ మోహిత్ (43)ను అరెస్టు చేసింది. దుబాయ్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా  నవంబర్ 21న ముంబై ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నవంబర్ 23న రాయ్‌పూర్‌లోని ఈడీ జోనల్ కార్యాలయంలో అరెస్టు చేశారు. ప్రస్తుతం నవంబర్ 28 వరకు ఈడీ కస్టడీలో విచారణ కొనసాగుతోంది.

మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ కేసులో కీలక సూత్రధారి, ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్‌కు శేఖర్  మధ్యవర్తిగా వ్యవహరించాడు.  క్రిమినల్ కేసులలో ఉపశమనం కల్పించడం, ఇంటర్‌పోల్ విచారణలను పరిష్కరించడం, బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల కోసం కేంద్ర ఏజెన్సీ చర్యలు తప్పించేందుకు సౌరభ్ నుంచి మోహిత్ రూ. 15 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

మహాదేవ్ యాప్ కేసుతో లింక్ ఏంటి?

ఈ డీ ప్రకారం.. 2023 అక్టోబర్‌లో దుబాయ్‌లోని ఓ విల్లాలో సౌరభ్ చంద్రకర్, సహ ప్రమోటర్ రవి ఉప్పల్ తదితరులను శేఖర్ కలివారు.  ప్రమోటర్లపై ఉన్న కేసులను ప్రభావితం చేయగలనని చెప్పినట్లు చంద్రకర్ వాంగ్మూలంలో వెల్లడైంది. మరోవైపు, బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన మాజీ భాగస్వామి గిరీష్ తల్రేజా అరెస్టు గురించి ముందుగానే సమాచారం ఇచ్చినట్లు కూడా ఆరోపణలున్నాయి.

కేసులో కీలక ఆధారాలు

శేఖర్ నివాసంలో సోదాల సందర్భంగా హవాలా చెల్లింపులకు సంబంధించినవిగా అనుమానిస్తున్న చేతిరాత నోట్లు లభించాయి. అతని ఫోన్‌లో మహాదేవ్ బుక్‌కు సంబంధించిన వీడియోలు, వాట్సాప్ మేసేజ్ లను కూడా ఈడీ గుర్తించింది. శేఖర్ సంస్థ టర్నోవర్ 2022లో రూ.52.66 లక్షల నుంచి 2023లో రూ.15.55 కోట్లకు పెరగడంపైనా దర్యాప్తు చేస్తోంది.

ఏంటీ మహాదేవ్ యాప్ కేసు..

మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ యాప్ అనేంది  అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించిన సిండికేట్‌గా ఈడీ గుర్తించింది. సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ ఈ వ్యవస్థలో కీలక ప్రమోటర్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బును హవాలా, ఇతర మార్గాల్లో తరలించినట్లు మనీలాండరింగ్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రమోటర్లకు న్యాయపరమైన ఉపశమనం కల్పిస్తానంటూ డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలతో హిమాన్షు శేఖర్ అరెస్టు కేసులో మరో కీలక పరిణామంగా మారింది.