హైదరాబాద్, వెలుగు: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (PVL) ఫ్రాంచైజీ తెలుగు బ్లాక్ హాక్స్ (Telugu Black Hawks) అద్భుత ప్రదర్శనతో మెరిసింది! కావా మెన్స్ వాలీబాల్ క్లబ్ చాంపియన్‌షిప్ (CAVA Men's Volleyball Club Championship) లో తెలుగు బ్లాక్ హాక్స్ జట్టు కాంస్య పతకం (Bronze Medal) కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన కాంస్య పతక పోరులో కజకిస్తాన్‌కు చెందిన జెటిసు వాలీబాల్ క్లబ్ (Zhetysu Volleyball Club) పై బ్లాక్ హాక్స్ 3–1 తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
కాంస్య పతక పోరులో ఆరంభం నుంచే తెలుగు బ్లాక్ హాక్స్ దూకుడుగా ఆడింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెట్లో బ్లాక్ హాక్స్ ఆటగాళ్లు కీలక పాయింట్లు రాబట్టి 25–23 తో పైచేయి సాధించారు. అనంతరం రెండో సెట్లో జెటిసు వాలీబాల్ క్లబ్ గట్టిగా పుంజుకుని 25–21 తో సెట్ గెలుచుకుని మ్యాచ్‌ను 1–1తో సమం చేసింది.
రెండో సెట్ కోల్పోయిన తర్వాత మరింత పట్టుదలతో కోర్టులోకి దిగిన తెలుగు బ్లాక్ హాక్స్, ఆ తర్వాత వెనక్కి తగ్గలేదు. మూడో సెట్‌ను 25–17 తో సునాయాసంగా గెలుచుకున్న బ్లాక్ హాక్స్, నాలుగో సెట్లోనూ 25–22 తో విజయం సాధించి 3–1 తేడాతో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఈ కీలక పోరులో తెలుగు బ్లాక్ హాక్స్ తరఫున హెక్టర్ అలెక్సిస్ క్రూజ్ ఏకంగా 29 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ చారిత్రక విజయం పట్ల తెలుగు బ్లాక్ హాక్స్ యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి, సహాయక బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
