ICC New Rules: టీ20 క్రికెట్‌లో బ్యాటర్లు అలవోకగా బంతిని బౌండరీ అవతలికి తరలిస్తుండటం, ప్రతి సీజన్‌లో సిక్సర్ల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు నిబంధనలకు విరుద్ధంగా మందపాటి, పెద్ద సైజు బ్యాట్లను వాడి అదనపు ప్రయోజనం పొందకుండా అడ్డుకునేందుకు, అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆకస్మిక బ్యాట్ తనిఖీలు (Surprise Bat Checks) నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఇకపై బ్యాటర్లు క్రీజులోకి వెళ్లే ముందే అంపైర్ల దగ్గర ఉండే ప్రత్యేక మెజరింగ్ గేజ్ (Measuring Gauge) ద్వారా తమ బ్యాట్లను పరీక్షించుకోవాల్సి ఉంటుంది.
సౌరవ్ గంగూలీ కమిటీ సిఫార్సులకు ఐసీసీ ఆమోదం:
బాలి (Bali) వేదికగా ఇటీవల జరిగిన ఐసీసీ సమావేశాల్లో సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) నేతృత్వంలోని క్రికెట్ కమిటీ చేసిన ఈ సిఫార్సును చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (CEC) ఆమోదించింది. మ్యాచ్ అధికారులకు కొత్త విధానంపై మార్గదర్శకాలు అందిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ సర్‌ప్రైజ్ బ్యాట్ చెకింగ్ అమల్లోకి రానుంది.
* MCC లా 5 ప్రకారం బ్యాట్ కొలతలు: బ్యాట్ అంచులు (Edges) 1.56 అంగుళాలు, లోతు (Depth) 2.64 అంగుళాలు, గరిష్ట వెడల్పు (Width) 4.25 అంగుళాలకు మించకూడదు.
* తయారీ లోపం ఉన్నా మినహాయింపు లేదు: బ్యాట్ తయారీ లోపం (Manufacturing fault) వల్ల పరిమాణం కాస్త ఎక్కువగా ఉన్నా సరే నిబంధనల ప్రకారం దాన్ని అనుమతించరు. బ్యాట్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడంతో బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పడుతోందన్న ఆందోళన నేపథ్యంలో ఐసీసీ ఈ కఠిన చర్యకు శ్రీకారం చుట్టింది.
స్టార్ల బ్యాట్లు మార్పించిన అంపైర్లు:
* 2008 తొలి ఐపీఎల్ సీజన్‌లో మ్యాచ్‌కు సగటున 8.88 సిక్సర్లు నమోదు కాగా, IPL 2026 లో అది ఏకంగా 19.27 సిక్సర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ గతేడాదే కఠిన తనిఖీలు ప్రారంభించింది.
* గతంలో మ్యాచ్‌కు ముందు ఒకటి రెండు బ్యాట్లు మాత్రమే తనిఖీ చేయడంతో, ఆటగాళ్లు చెక్ చేయని మరో బ్యాట్‌ను మైదానంలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉండేది.
* దీన్ని అరికట్టేందుకు మైదానంలోనే మెజరింగ్ గేజ్‌తో తనిఖీలు చేపట్టగా.. సునీల్ నరైన్, రవీంద్ర జడేజా, రియాన్ పరాగ్ లాంటి స్టార్ ఆటగాళ్ల బ్యాట్లు గేజ్‌లో పట్టకపోవడంతో అంపైర్లు అక్కడికక్కడే వారి బ్యాట్లను మార్పించారు. ఇప్పుడు ఇదే తరహా విధానాన్ని ఐసీసీ అంతర్జాతీయ మ్యాచ్‌లకు విస్తరిస్తోంది.
2029, 2030 U-19 ప్రపంచకప్‌లలో కొత్త బంతుల ట్రయల్స్:
* కేవలం బ్యాట్లపైనే కాకుండా, బంతుల నాణ్యతను మెరుగుపరచడంపైనా ఐసీసీ దృష్టి సారించింది. ఇటీవల వెల్లింగ్టన్ టెస్టు తర్వాత భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ సైతం బంతులు త్వరగా మెత్తబడుతున్నాయని ఐసీసీకి ఫిర్యాదు చేశారు.
* కొత్త బంతుల ప్రయోగం: 2029, 2030 అండర్-19 ప్రపంచకప్ టోర్నీలలో విభిన్న బంతులను ప్రయోగాత్మకంగా పరీక్షించాలని క్రికెట్ కమిటీ ప్రతిపాదించింది.
* కుకబుర్రాకు ప్రత్యామ్నాయమా?: ప్రస్తుతం ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నీలన్నింటిలో కుకబుర్రా (Kookaburra) వైట్ బాల్స్ వాడుతున్నారు. కుకబుర్రాను పూర్తిగా తొలగించే ఉద్దేశం లేకపోయినా, పోటీతత్వ కొనుగోలు విధానం ద్వారా బంతుల నాణ్యత, పరిశోధన (R&D) మెరుగుపరచాలని ఐసీసీ లక్ష్యంగా పెట్టుకుంది.
