‘సామజవరగమన’ లాంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత హీరో శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ ప్యాక్’. సాక్షి మధోల్కర్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. సోమవారం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ‘ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కథలో ఒక కొత్త యాంగిల్ ఉంటుంది. అది టీజర్‌లో, ట్రైలర్‌లో ఉండదు. మీరు థియేటర్‌లోనే ఎంజాయ్ చేస్తారు. సాక్షి చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది.
వెన్నెల కిషోర్, సత్య, సుదర్శన్, బుల్లిరాజుల కామెడీ ఆకట్టుకుంటుంది. నరేష్ గారిది కూడా చాలా మంచి క్యారెక్టర్. డైరెక్టర్ రామ్ అబ్బరాజు, డీఓపీ యువరాజ్, బ్రహ్మ కడలి సహా టీమ్ అంతా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. సినిమాను చాలా మంచి ఫన్ ప్యాక్‌తో సిద్ధం చేశాం’ అని చెప్పాడు. డైరెక్టర్ రామ్ అబ్బరాజు మాట్లాడుతూ ‘ఇందులో ఫన్ అద్భుతంగా వర్కౌట్ అయింది. సంక్రాంతి రోజున ప్రేక్షకులకు అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది’ అని చెప్పాడు. హీరోయిన్ సాక్షి మధోల్కర్, నటుడు సుదర్శన్, డీఓపీ యువరాజ్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు.
