డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగొస్తా.. షేక్ హసీనా కీలక ప్రకటన

డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగొస్తా.. షేక్ హసీనా కీలక ప్రకటన

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి రావడానికి తేదీని ప్రకటించారు. డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆమె ప్రకటించారు.

2024 ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ ఆందోళనల నేపథ్యంలో అధికారం కోల్పోయి భారత్‌కు వెళ్లిన ఆమె.. రెండేళ్లకు పైగా ఢిల్లీలో ప్రవాస జీవితం గడుపుతున్నారు. తాజాగా తొలిసారిగా తన రాకకు నిర్దిష్ట తేదీని ప్రకటించడం బంగ్లాదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

డిసెంబర్ 16 బంగ్లాదేశ్‌లో విజయ దినోత్సవం. 1971లో పాకిస్థాన్ నుంచి విముక్తి పొంది స్వాతంత్ర్యం సాధించిన సందర్భంగా ఈ రోజును అక్కడ ఘనంగా జరుపుకుంటారు. ఇదే రోజున ఢిల్లీ నుంచి ఢాకాకు చేరుకోవాలని హసీనా భావిస్తున్నట్లు ఆమె అధికార ప్రతినిధి సయ్యద్ మొజమ్మెల్ అలీ మంగళవారం రాయిటర్స్‌కు వెల్లడించారు.

ప్రభుత్వమే విమాన ప్రయాణం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్

తాను భారత్‌కు వచ్చినప్పుడు బంగ్లాదేశ్ విమానంలోనే ప్రయాణించానని గుర్తుచేసిన హసీనా.. ఇప్పుడు కూడా ఢిల్లీ నుంచి ఢాకాకు తిరిగి వెళ్లేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం జాతీయ విమానయాన సంస్థ బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ ద్వారా ప్రయాణ ఏర్పాట్లు చేయాలని కోరినట్లు ఆమె ప్రతినిధి తెలిపారు.

రాజ్యాంగ విరుద్ధ పరిస్థితుల్లో తనను దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారని, అందువల్ల విజయ దినోత్సవం రోజున స్వదేశానికి తిరిగి రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హసీనా పేర్కొన్నట్లు ప్రతినిధి వెల్లడించారు.

పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు

స్వదేశానికి తిరిగి రావడానికి అవసరమైన పత్రాల కోసం హసీనా ఇటీవల ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో ఆమెకు ఉన్న పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు (NID)లను బంగ్లాదేశ్ అధికారులు రద్దు చేశారు. దీంతో కొత్త పాస్‌పోర్టు, ఎన్‌ఐడీ జారీ చేయాలని కోరుతూ ఆమె తరఫు న్యాయ ప్రతినిధులు నవంబర్ 9న న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌ను సంప్రదించినట్లు సమాచారం.లండన్‌కు చెందిన మ్యాట్రిక్స్ ఛాంబర్స్ న్యాయ సంస్థ ఈ మేరకు హైకమిషన్‌కు లేఖ రాసింది. అనంతరం హసీనా సంతకం చేసిన అధికార పత్రంతో మరోసారి దరఖాస్తు స్థితిగతులపై సమాచారం కోరింది. అయితే ఆమెకు ప్రయాణ పత్రాలు జారీ చేయడానికి చట్టపరమైన ఆధారాలు లేవని బంగ్లాదేశ్ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

ప్రత్యర్పణ ఒప్పందం ద్వారానే రావాలంటున్న ఢాకా

హసీనా స్వదేశానికి తిరిగి రావాలంటే భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రత్యర్పణ ఒప్పందం ప్రకారమే ప్రక్రియ జరగాలని ఢాకా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇప్పటికే ఆమెను భారత్ నుంచి అప్పగించాలని అధికారికంగా కోరినట్లు బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. ఈ అభ్యర్థనను సంబంధిత చట్టపరమైన ప్రక్రియలో పరిశీలిస్తున్నట్లు భారత అధికారులు వెల్లడించారు.మరోవైపు, హసీనా తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని అక్కడి మంత్రి ఒకరు ఆదివారం రాయిటర్స్‌కు తెలిపారు. ఆమెను తీసుకురావడానికి విమానాన్ని ఏర్పాటు చేసే విషయంలో భారత్‌తో ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని కూడా స్పష్టం చేశారు.

హసీనాకు మరణశిక్ష.. రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ

బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం కొనసాగుతోంది. మరోవైపు, 2025 నవంబర్‌లో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. 2024లో విద్యార్థుల ఆందోళనల సమయంలో జరిగిన హింసాత్మక అణచివేతలో ఆమె పాత్రకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారంటూ ఆమె గైర్హాజరీలోనే కోర్టు దోషిగా నిర్ధారించింది.

అయితే ఈ ఆరోపణలను, తీర్పును హసీనా ఖండించారు. తనపై జరిగిన విచారణ రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. 2024 ఆగస్టులో ఆమె ప్రభుత్వం కూలిపోయేలా చేసిన ఆందోళనల్లో సుమారు 1,400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

ఈ క్రమంలో డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానంటూ హసీనా చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె రాకకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతిస్తుందా? భారత్ నుంచి అప్పగింత ప్రక్రియ ఎలా సాగుతుంది? స్వదేశానికి చేరుకుంటే ఆమెను అరెస్టు చేస్తారా? అనే అంశాలపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.