భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. విస్తారమైన భౌగోళిక విస్తీర్ణం, వేల కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దులు, సముద్రతీర ప్రాంతాలు, వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలు మన దేశ భద్రతను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా నిలుపుతున్నాయి. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి ఎదురయ్యే భద్రతాపరమైన సవాళ్లతోపాటు అక్రమ చొరబాట్లు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల రవాణా, ఉగ్రవాద ముప్పులు, సైబర్ దాడులు, తప్పుడు సమాచార ప్రచారాలు వంటి ఆధునిక సమస్యలను దేశం ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ రక్షణ బాధ్యత కేవలం సైన్యం, పోలీసు, భద్రతా సంస్థలకే పరిమితం కాకుండా ప్రతి పౌరుడిలోనూ కనీస జాతీయ భద్రతా అవగాహన, క్రమశిక్షణ, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందించాలి. సైనికులు దేశ సరిహద్దులను కాపాడితే, ప్రజలు తమ గ్రామాలు, పట్టణాలు, సమాజాన్ని సురక్షితంగా ఉంచే బాధ్యతను నిర్వర్తించాలి.
ఇజ్రాయెల్ వంటి దేశాల్లో జాతీయ భద్రత, పౌర రక్షణ, అత్యవసర పరిస్థితుల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయి. వాటి అనుభవాలను అధ్యయనం చేసి భారతదేశ జనాభా, ప్రజాస్వామ్య వ్యవస్థ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా సమగ్ర జాతీయ పౌర రక్షణ శిక్షణ విధానాన్ని రూపొందించాలి. ఈ శిక్షణను సైనిక నియామకంగా కాకుండా పౌర బాధ్యత, ప్రాణరక్షణ, విపత్తుల నిర్వహణ, సాంకేతిక అవగాహనకు సంబంధించిన కార్యక్రమంగా రూపొందించాలి. మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు తమ సామర్థ్యానికి అనుగుణంగా పాల్గొనే అవకాశం కల్పించాలి. ప్రాథమిక విద్య నుంచే పౌర బాధ్యత, క్రమశిక్షణ, ప్రథమ చికిత్స, సీపీఆర్, అగ్నిప్రమాదాల నివారణ, ప్రకృతి విపత్తుల నిర్వహణ, సైబర్ భద్రత వంటి అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి. కేవలం పుస్తకాల ద్వారా కాకుండా మాక్ డ్రిల్స్, ప్రాక్టికల్ తరగతులు, అత్యవసర తరలింపు అభ్యాసాలు నిర్వహించాలి. ప్రతి విద్యార్థి తన కుటుంబంలో, పరిసర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రాథమికంగా ఎలా స్పందించాలో తెలుసుకోవాలి.
గ్రామమే రక్షణకు తొలి కేంద్రం
ప్రతి గ్రామ పంచాయతీలో స్థానిక యువత, మహిళలు, స్వచ్ఛంద సేవకులతో గ్రామ పౌర అత్యవసర స్పందన బృందాలను ఏర్పాటు చేయాలి. ఈ బృందాలకు వరదలు, తుపానులు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు వంటి సందర్భాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వృద్ధులు, చిన్నపిల్లలు, దివ్యాంగులకు సహాయం చేయడం, ప్రాథమిక వైద్య సహాయం అందించడం వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వాలి. ప్రతి గ్రామంలో అత్యవసర సంప్రదింపు నంబర్లు, సురక్షిత ప్రాంతాల మ్యాపింగ్, ప్రాథమిక వైద్య కిట్లు, రక్తదాతల సమాచార వ్యవస్థ, స్థానిక వాలంటీర్ల డిజిటల్ రిజిస్టర్ ఏర్పాటుచేయాలి.
అదేవిధంగా ప్రతి మండలం, జిల్లా స్థాయిలో దశలవారీగా ప్రత్యేక పౌర రక్షణ శిక్షణ శిబిరాలను నిర్వహించాలి. నెలరోజుల శిక్షణ నమూనాను రూపొందించి, అవసరమైన ప్రయోగిక నైపుణ్యాలను అందించాలి. భారత సైనిక అధికారులు, పదవీ విరమణ చేసిన సైనికులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్, పోలీసు, అగ్నిమాపకశాఖ, వైద్య నిపుణుల సహకారంతో శిక్షణ ఇవ్వాలి. ప్రథమ చికిత్స, అగ్నిమాపక పరికరాల వినియోగం, వరదల సమయంలో రక్షణ, అత్యవసర విద్యుత్ భద్రత, భద్రతా ప్రాంతాలకు తరలింపు వంటి అంశాల్లో ప్రతి ఒక్కరికీ ప్రాథమిక నైపుణ్యాలు అందించాలి.
డిజిటల్ ఇండియా - స్మార్ట్ సెక్యూరిటీ
ప్రస్తుత కాలంలో జాతీయ భద్రత సంప్రదాయ భద్రతా వ్యవస్థలకే పరిమితం కాలేదు. కృత్రిమ మేధస్సు(ఏఐ), జీపీఎస్, జీఐఎస్ మ్యాపింగ్, ఉపగ్రహ సమాచార వ్యవస్థలు, డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజిటల్ కమ్యూనికేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు విపత్తుల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల యువతకు ఈ రంగాల్లో ప్రాథమిక సాంకేతిక అవగాహన కల్పించాలి. విపత్తు ప్రాంతాలను గుర్తించడం, సహాయక బృందాలకు సమాచారాన్ని చేరవేయడం, డిజిటల్ హెచ్చరిక వ్యవస్థలను ఉపయోగించడం, సైబర్ మోసాలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించడం వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వాలి. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినప్పుడు ప్రజలు పోలీసు, సంబంధిత భద్రతా అధికారులకు సమాచారం అందించే బాధ్యతాయుత విధానాన్ని నేర్పించాలి.
స్టార్టప్ ఇండియా
డిఫెన్స్ ఇన్నోవేషన్‌ను ఉన్నత విద్యాసంస్థలకే పరిమితం చేయకుండా స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు, పారిశ్రామికవేత్తలు, యువ ఇంజినీర్లను కూడా భాగస్వాములుగా చేయాలి. ప్రభుత్వం ప్రత్యేక ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లు నిర్వహించి, అత్యుత్తమ ఆవిష్కరణలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పరిశోధన దశ నుంచి ప్రోటోటైప్, పరీక్షలు, నాణ్యతా ధ్రువీకరణ, అవసరమైన అనుమతులు, వాణిజ్య ఉత్పత్తి వరకు సహకారం అందించాలి. తక్కువ వ్యయంతో, అధిక సామర్థ్యంతో పనిచేసే స్వదేశీ సాంకేతిక పరిష్కారాలు అభివృద్ధి చెందితే భారతదేశం రక్షణ పరిశోధన రంగంలో మరింత స్వయంసమృద్ధిని సాధించగలదు. కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ, హోంశాఖ, విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, డీఆర్డీఓ తదితర సంస్థల సమన్వయంతో జాతీయ పౌర రక్షణ, డిఫెన్స్ ఇన్నోవేషన్ విధానం రూపొందించాలి. ముందుగా ఎంపిక చేసిన జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, ఫలితాలను సమీక్షించిన తరువాత దేశవ్యాప్తంగా విస్తరించాలి.
సైనికుడికి తోడుగా పౌరుడు!
దేశాన్ని రక్షించే సైనికుడు సరిహద్దుల్లో ఉంటే, దేశ ప్రజలను రక్షించే బాధ్యతాయుత పౌరుడు దేశంలో ఉండాలి. ప్రతి విద్యార్థికి ప్రాణరక్షణ నైపుణ్యం, ప్రతి యువకుడికి సాంకేతిక పరిజ్ఞానం, ప్రతి కాలేజీకి పరిశోధన వేదిక, ప్రతి జిల్లాకు డిఫెన్స్ ఇన్నోవేషన్ కేంద్రం ఉండాలి. భారతదేశ భవిష్యత్తు కేవలం అధునాతన ఆయుధ సంపత్తిలోనే కాదు.. శాస్త్రీయ ఆలోచన కలిగిన యువతలో ఉంది. విపత్తులను ఎదుర్కొనే శిక్షణ పొందిన ప్రజలు, స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసే పరిశోధకుల్లో కూడా దేశంపట్ల బాధ్యతగా ఉండాలి. ప్రతి పౌరుడికి శిక్షణ, దేశభక్తి. ఇదే సురక్షిత, స్వయంసమృద్ధి, సాంకేతికంగా శక్తిమంతమైన భారతదేశ నిర్మాణానికి పునాదికావాలి.
ఇమ్మడిశెట్టి దేవేంద్ర
సోషల్ ఎనలిస్ట్
