- ధ్రువ్ రాఠీపై నాన్ బెయిలబుల్ వారెంట్..
- 2018 పరువు నష్టం కేసులో
- ఢిల్లీ కోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో ఆయనపై దాఖలైన పరువు నష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. బీజేపీ ఐటీ సెల్ తనను ప్రలోభపెట్టి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిందంటూ ధ్రువ్ రాఠీ 2018లో ‘బీజేపీ ఐటీ సెల్ పార్ట్-2’ పేరుతో యూట్యూబ్లో వీడియో విడుదల చేశారు.
ఈ ఆరోపణలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించాయని పేర్కొంటూ బీజేపీ మద్దతుదారుడు, ‘ఐ సపోర్ట్ నరేంద్ర మోదీ’ ఫేస్బుక్ పేజీ వ్యవస్థాపకుడు వికాస్ సాంకృత్యాయన్ (వికాస్ పాండే) కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ కూడా ఈ వీడియోను షేర్ చేశారు. ఈ కేసులో 2019 జులైలోనే రాఠీకి కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ఆయన విదేశాల్లో నివసిస్తుండటంతో సమన్ల అమలులో ఇబ్బందులు ఎదురయ్యాయి.
