- ఎస్పీని అడిగిన కాంగ్రెస్
- ప్రతి జిల్లాలో కనీసం ఒక్క సీటు కావాలె
- అమేథీ, రాయ్‌బరేలీలో అన్ని స్థానాలపై పట్టు
- అఖిలేశ్‌తో మాట్లాడి చెబుతామన్న ఎస్పీ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన డిమాండ్లను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ముందు ఉంచింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక సీటు చొప్పున మొత్తం 130 స్థానాలు తమకు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ నివాసంలో సోమవారం సీట్ల పంపకాలపై తొలి విడత చర్చలు జరిగాయి. ఈ భేటీ కేవలం 15 నిమిషాలే సాగింది. తమకు పట్టున్న అమేథీ, రాయ్‌బరేలీ ప్రాంతాల్లోని అన్ని
అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ అడిగింది. ఎస్పీ కంచుకోటలైన ఇటావా, మెయిన్‌పురి జిల్లాల్లో మాత్రం సీట్లు అడగలేదని సమాచారం.
అఖిలేశ్‌తో మాట్లాడి చెబుతం: ఎస్పీ
భేటీ మొదలుకాగానే మీ నిర్ణయం ఏంటని ఎస్పీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్ కాంగ్రెస్ నేతలను అడిగారు. వెంటనే కాంగ్రెస్ నేతలు 130 సీట్ల జాబితాను టేబుల్‌పై పెట్టారు. జాబితా చూసిన ఎస్పీ నేతలు అప్పటికప్పుడు ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో చర్చించాక మంగళవారం జరిగే రెండో విడత చర్చల్లో తమ నిర్ణయం చెబుతామన్నారు. భేటీ తర్వాత ఇరు పార్టీల నేతలు సానుకూలంగా మాట్లాడారు.
చర్చలు ముగియలేదని, భేటీ మాత్రమే ముగిసిందని రామ్‌గోపాల్ యాదవ్ చెప్పారు. వాతావరణం చాలా స్నేహపూర్వకంగా ఉందని, రెండు మూడు రోజుల్లో సీట్ల పంపకాలు పూర్తి చేస్తామన్నారు. పొత్తు కోసం ప్రాథమిక కసరత్తు పూర్తయిందని, వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నేత ఆరాధనా మిశ్రా ‘మోనా’ ధీమా వ్యక్తం చేశారు.
