- అభివృద్ధి, సంక్షేమ పథకాలను స్వాగతిస్తున్నరు: బీఎం సందీప్
- ముగిసిన కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ రెండు రోజుల పర్యటన
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ బీఎం సందీప్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను జనం స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సంస్థాగతంగా బలంగా ఉందని, నేతలంతా ఐక్యంగా, సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. వచ్చే రెండేళ్లలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, రాబోయే ఎన్నికల్లో ప్రస్తుతమున్న సీట్ల కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా వ్యూహాలపై చర్చించినట్లు వెల్లడించారు.
ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు రోజుల తెలంగాణ పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం గాంధీభవన్ నుంచి బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం, సోమవారం పార్టీ, ప్రభుత్వ నేతలందరినీ కలిశానని, వారి అభిప్రాయాల ద్వారా రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. ఆదివారం పీఏసీ, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాలతో పాటు పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కూడా పాల్గొని పలు అంశాలపై చర్చించారని వివరించారు.
సోమవారం మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో విడివిడిగా సమావేశమయ్యారు. ప్రభుత్వ, పార్టీ పనితీరుపై వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. అవినీతి బీఆర్ఎస్తో పాటు, విభజన శక్తులుగా పేర్కొంటున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా పోరాడుతున్నారని సందీప్ చెప్పారు. తనకంటే ముందు రాష్ట్ర ఇన్చార్జ్గా పనిచేసిన మీనాక్షి నటరాజన్ పార్టీ బలోపేతానికి కృషి చేశారని పేర్కొన్నారు.
26న మళ్లీ హైదరాబాద్కు..
సందీప్ రెండు రోజుల పర్యటన సోమవారం సాయంత్రంతో ముగిసింది. మంగళవారం ఉదయం ఆయన బెంగళూరుకు తిరిగి వెళ్లనున్నారు. ఈ నెల 26న మళ్లీ హైదరాబాద్కు రానున్నారు. సిటీలో నిర్వహించనున్న భారీ ర్యాలీలో పాల్గొంటారు.
