Australia Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుని రోజుకో వివాదం చుట్టుముడుతోంది.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయంగా నిలిచిన 2018 కేప్‌టౌన్ సాండ్‌పేపర్ (Sandpaper Gate) బాల్ ట్యాంపరింగ్ ఉదంతం జరిగి దాదాపు ఎనిమిదేళ్లు గడుస్తున్నా, ఆ గాయం ఇంకా మానలేదు. తాజాగా ఆస్ట్రేలియా ప్రముఖ జర్నలిస్ట్ జెరార్డ్ వాట్లీ (Gerard Whateley) SEN మీడియా కోసం చేసిన పరిశోధనలో కంగారూ జట్టు డ్రెస్సింగ్ రూమ్ చీకటి రహస్యాలు మరోసారి బట్టబయలయ్యాయి. కేప్‌టౌన్ ఘటన జరిగిన కేవలం కొన్ని నెలలకే, 2018 అక్టోబర్‌లో పాకిస్థాన్‌తో దుబాయ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ ప్లేయర్స్ మింట్స్ (Mints - చాక్లెట్లు) వాడి బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించారన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
దుబాయ్ టెస్టులో మింట్స్ ప్లాన్:
* 2018 అక్టోబర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లకు బంతితో ఎలాంటి స్వింగ్ లభించకపోవడంతో కొందరు ఆటగాళ్లు పాత అలవాట్లకు తెరలేపాలని చూశారు.
* మింట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి?: మైదానంలో ఉన్న ఒక ఆసీస్ ఆటగాడు మింట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఈరోజు బంతిని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? అని అడిగినట్లు వాట్లీ పరిశోధనలో తేలింది. దీనికి మరో ప్లేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కేప్‌టౌన్ తర్వాత మళ్లీ అలాంటి రిస్క్ ఎందుకు చేస్తున్నారని నిలదీశాడు.
* అడ్డుకున్న కెప్టెన్ టిమ్ పైన్: అయినప్పటికీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి మింట్స్ తీసుకురావడానికి ఒక సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌ను పంపారు. కానీ అప్రమత్తమైన అప్పటి కెప్టెన్ టిమ్ పైన్ (Tim Paine), వాటిని మైదానంలోకి తీసుకురావద్దని సైగ చేసి ఆ ప్లేయర్ ని వెనక్కి పంపించేశాడు.
* లాంగర్ షాకింగ్ రియాక్షన్: ఆ రోజు ఆట ముగిశాక హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ (Justin Langer) డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక బ్యాగీ గ్రీన్ (Baggy Green) క్యాప్‌ను తన వెనుక భాగంపై తుడుచుకుంటూ.. ప్లేయర్స్ చర్యలు ఆ జట్టు గౌరవాన్ని ఎలా దిగజారుస్తున్నాయో ప్రదర్శించి చూపించాడు.
బ్యాంగర్స్‌ను బలిపశువుని చేయొద్దు.. వార్నర్‌పై మార్ష్ ఫైర్:
* 2018 మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన కేప్‌టౌన్ టెస్టులో సాండ్‌పేపర్ ఉదంతం బయటపడిన తర్వాత హోటల్ గదిలో ఏం జరిగిందో కూడా ఈ ఇన్వెస్టిగేషన్‌లో బయటపడింది.
* వార్నర్‌ను నిలదీసిన మార్ష్: తొలుత కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ (బ్యాంగర్స్) తప్పు మొత్తాన్ని తనపై వేసుకోవడానికి సిద్ధపడ్డాడు. స్టీవ్ స్మిత్ కూడా బాధ్యత పంచుకోవడానికి ముందుకొచ్చాడు. అయితే ఈ కుట్రలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డేవిడ్ వార్నర్ (David Warner) తప్పించుకోవడానికి ప్రయత్నించగా, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh) హోటల్‌లో వార్నర్‌ను గట్టిగా నిలదీశాడు.
ALSO READ : మా నాన్న కాదు, నా ఫేవరెట్ క్రికెటర్ అతడే.. సెహ్వాగ్ కొడుకు క్రింజి కామెంట్స్
తప్పించుకోలేవు మామా: నువ్వు దీని నుంచి తప్పించుకోలేవు మిత్రమా.. నీ కోసం బ్యాంగర్స్ (బాన్‌క్రాఫ్ట్) బలి కావడానికి మేము అస్సలు ఒప్పుకోం అని వార్నర్‌కు మిచెల్ మార్ష్ తేల్చి చెప్పాడు. దీంతో తాను బాధ్యత తీసుకుంటానని, కానీ శిక్ష మొత్తం ఒక్కడినే భరించనని వార్నర్ బదులిచ్చినట్లు తెలుస్తోంది.
కేప్‌టౌన్ కంటే ముందే బాల్ ట్యాంపరింగ్:
* సాండ్‌పేపర్ ఉదంతంలో కేవలం స్మిత్, వార్నర్ (12 నెలల నిషేధం), బాన్‌క్రాఫ్ట్ (9 నెలల నిషేధం) మాత్రమే శిక్షకు గురయ్యారు. కానీ అసలు నిజాలు వేరేలా ఉన్నాయని తాజా నివేదిక చెబుతోంది.
* కేప్‌టౌన్ టెస్టుకు చాలా కాలం ముందు నుంచే సాండ్‌పేపర్ లేకుండా ఇతర మార్గాల్లో బాల్ ట్యాంపరింగ్ జరుగుతూనే ఉందని ఓ సన్నిహిత వర్గం పేర్కొంది.
* ఉస్మాన్ ఖవాజా ఆత్మకథతో పాటు బాన్‌క్రాఫ్ట్, చాడ్ సేయర్స్ వ్యాఖ్యలు కూడా డ్రెస్సింగ్ రూమ్‌లోని చాలామందికి ఈ విషయం తెలుసనే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. కానీ ప్రస్తుత కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, అప్పటి కోచ్ డారెన్ లెమాన్ తమకు ఈ ప్లాన్ గురించి ఏమీ తెలియదని మొదటి నుంచి చెప్తున్నారు.
