ట్రంప్ AIతో విచిత్రమైన పోస్టు..! : ఎన్విడియా సీఈఓతో లింక్ ఏంటో

ట్రంప్ AIతో విచిత్రమైన పోస్టు..! : ఎన్విడియా సీఈఓతో లింక్ ఏంటో

ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ఏఐ ఇమేజ్ ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు. 2024 జూలైలో తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన ఒక ఫొటోను మార్చి ఈ ఏఐ చిత్రాన్ని రూపొందించారు. ఆ ఒరిజినల్ ఫొటోలో తన స్థానంలో జెన్సన్ హువాంగ్‌ను ఉంచారు. అందులో అమెరికా జెండాకు బదులుగా ఎన్విడియా జెండా కనిపిస్తోంది. హువాంగ్ ఒక ఎర్రటి బ్రాను తన తలపై పట్టుకుని విజయగర్వంతో ఉన్నట్లు ఈ ఏఐ జనరేటెడ్ ఫొటోలో చూపించారు ట్రంప్.

ఎన్విడియా తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పదని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడంలో తన పాత్ర ఉందని చెప్పారు. దీనికోసం తాను స్వయంగా బోర్డు సభ్యులతో మాట్లాడి వారిని ఒప్పించానని తెలిపారు. వారం రోజుల క్రితం ఉన్న పరిస్థితుల కంటే నిన్న వారిని ఒప్పించడం చాలా సులభమైందని ట్రంప్ వివరించారు.

2 వారాల క్రితం హువాంగ్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన నుంచి జాతీయ భద్రతకు ఎటువంటి ముప్పు లేదని గ్యారెంటీ ఇవ్వాలని ఎన్విడియా బోర్డు కోరిందని ట్రంప్ చెప్పారు. తమకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని బోర్డుకు భరోసా ఇచ్చినట్లు తెలిపారు. హువాంగ్ ఒక గొప్ప దేశభక్తుడని, ఆయన దేశానికి ఒక ఆస్తి అని ట్రంప్ అభివర్ణించారు. జెన్సన్ హువాంగ్ ఎటువంటి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడలేదని అటార్నీ జనరల్ ధ్రువీకరించారని పేర్కొన్నారు.

ALSO READ : ఎన్విడియా సీఈవోగా మళ్లీ హువాంగ్.. 11 రోజుల్లోనే జెన్సన్ రీఎంట్రీ!

అమెరికా ఎగుమతి నియంత్రణల విషయంలో ఎన్విడియా తన అంతర్గత విచారణను కొనసాగించాలని ట్రంప్ సూచించారు. చట్టపరమైన బాధ్యతలను నెరవేరుస్తూ జాతీయ భద్రతను కాపాడటం కంపెనీ విధి అని చెప్పారు. చైనా గూఢచారిగా అనుమానిస్తున్న ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో హువాంగ్ గతంలో రాజీనామా చేశారు. హువాంగ్ తిరిగి సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆయన మూడు హౌస్ కమిటీల ముందు క్లోజ్డ్ డోర్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమెరికా ఏఐ ప్రయోజనాల రక్షణపై సెనేట్ బ్యాంకింగ్ కమిటీ నిర్వహించే బహిరంగ విచారణకు కూడా హాజరవుతారు హువాంగ్.
 

మరిన్ని వార్తలు