న్యూఢిల్లీ: కారు, బైక్ ఇన్సూరెన్స్ చేయించాలంటే ఏజెంట్ల చుట్టూ తిరగడం, అధిక కమీషన్ల భారం మోయడం వంటి సమస్యలకు త్వరలోనే తెరపడనుంది. బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) ఆధ్వర్యంలో రూపొందిన ‘బీమా సుగమ్’ అనే ప్రభుత్వ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈ వారంఅందుబాటులోకి రానుంది.
మొదటగా ప్రైవేట్ కార్లు, బైక్ల బీమా సేవలు ఇందులో మొదలవుతాయి. ఇప్పటివరకు పాలసీ కొన్నప్పుడు ఏజెంట్లు లేదా బ్రోకర్లకు కంపెనీలు చెల్లించే భారీ కమీషన్ ఇకపై ఉండదు. బీమా కంపెనీలు ప్లాట్ఫామ్ ఫీజు కింద కేవలం 5శాతం కడితే సరిపోతుంది. దీనివల్ల కంపెనీలకు మిగిలే డబ్బును కస్టమర్లకు ప్రీమియం తగ్గింపు రూపంలో ఇచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం.. వాహన బీమాను నాలుగు భాగాలుగా విభజించారు.
తప్పనిసరి థర్డ్-పార్టీ బీమాతో పాటు ప్రయాణికుల రక్షణ, వ్యక్తిగత ప్రమాద బీమా, సొంత వాహన డ్యామేజ్ కవర్లను మన అవసరానికి తగ్గట్టుగా విడివిడిగా ఎంచుకుని డబ్బు ఆదా చేసుకోవచ్చు. భవిష్యత్తులో జీవిత, ఆరోగ్య, వాహన బీమా పాలసీల ధరలను పోల్చుకోవడం, కొనడం, రెన్యువల్ చేయడం, క్లెయిమ్ చేసుకోవడం వంటి పనులన్నీ ఏజెంట్ల ఒత్తిడి లేకుండా ఈ ఒక్క వెబ్సైట్ ద్వారానే పూర్తి చేసుకోవచ్చు.
