‘కోటి ఓట్లు.. 90 సీట్లు’ లక్ష్యంతో ముందుకు వెళ్తాం : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

‘కోటి ఓట్లు.. 90 సీట్లు’ లక్ష్యంతో ముందుకు వెళ్తాం : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ‘కోటి ఓట్లు.. 90 సీట్లు’ సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం జరిగిన పీసీసీ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగుతాయని మహేశ్ గౌడ్ చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సమగ్రంగా వివరించారని పేర్కొన్నారు.

మరోవైపు, ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ నెల 26న హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించనున్నట్టు పీసీసీ చీఫ్ వెల్లడించారు. లిబర్టీ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని వివరించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్‌చార్జ్ బీఎం సందీప్ ఆది, సోమవారాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.