- కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు లేవు
- కేటీఆర్ ఊహా ప్రపంచంలో బతుకుతున్నారు
- సోషల్ మీడియానే ప్రపంచం అనుకుంటున్నారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాదయాత్రలు చేస్తున్నామంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తక్షణమే నిలిపివేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి బీజేపీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, ఆ పార్టీ తనను తానే అపహాస్యం చేసుకుంటోందని విమర్శించారు. సోమవారం గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ బీఎం సందీప్ కుమార్ను భట్టి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజ్యాంగాన్ని బలహీనపరచాలని బీజేపీ కుట్ర
కరీంనగర్లో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేపట్టిన ‘లోక్తంత్ర బచావో.. అరాచకత హటావో’ పాదయాత్రపై భట్టి స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నది బీజేపీయేనన్న విషయం ప్రజలందరికీ తెలుసని తెలిపారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచి, ప్రజాస్వామ్య వ్యవస్థను తమ నియంత్రణలోకి తీసుకురావాలని కుట్ర పన్నుతోందని ఆరోపించారు. దేశం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని, ప్రజాస్వామ్యం స్థానంలో రాచరిక పాలన తీసుకురావాలన్నదే ఆ పార్టీ లక్ష్యమని మండిపడ్డారు. ప్రజల హక్కులు, ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాడుతోందని చెప్పారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాం
బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఊహా ప్రపంచంలో బతుకుతున్నారని, సోషల్ మీడియానే ప్రపంచం అనుకుంటున్నారని భట్టి ఎద్దేవా చేశారు. గత పదేండ్లలో నాలుగు కుటుంబాలు రాష్ట్ర వ్యవస్థలను కుప్పకూల్చాయని, భవిష్యత్తులో వారికి రాజకీయాల్లో స్థానం ఉండదని స్పష్టం చేశారు.
తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి జలాలను తెలంగాణకు దక్కేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణా జలాలపై పూర్తి లెక్కలతో సహా వాస్తవాలను ప్రజల ముందుంచామని వెల్లడించారు.
కాంగ్రెస్ పటిష్టంగా ఉంది
కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్ని భట్టి ఖండించారు. ఊహాజనిత ప్రచారాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, పార్టీ అత్యంత పటిష్టంగా ఉందని వివరించారు. క్రమశిక్షణ కాంగ్రెస్కు సహజమైన అంతర్భాగమన్నారు. రాష్ట్ర సంపదను పేదలకు పంచుతూ, గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని వివరించారు. సంస్థాగత వ్యవహారాలు, యువజన కాంగ్రెస్లో అనుభవం ఉన్న సందీప్ కుమార్ సేవలు పీసీసీ బలోపేతానికి ఎంతో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
