ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి     మాజీ ఎంపీ మీడియం బాబురావు 

ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి       మాజీ ఎంపీ మీడియం బాబురావు 

ములకలపల్లి, వెలుగు: ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, పోడు సాగుదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ ఎంపీ, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మీడియం బాబురావు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో సోమవారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా మూడో మహాసభ నిర్వహించారు. ముందుగా స్థానిక ఎస్బీఐ బ్యాంకు నుంచి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, జెండా ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, సభను ప్రారంభించారు. గౌరీ నాగేశ్వరరావు, సున్నం గంగా అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన మీడియం బాబురావు మాట్లాడుతూ సాగులో ఉన్న ప్రతి ఎకరాకు పట్టా ఇవ్వాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

అటవీశాఖ అధికారులు ఆదివాసీ రైతులపై దాడులు ఆపాలని, పోడు సాగుదారులకు న్యాయం చేయాలని కోరారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్ మాట్లాడుతూ ఐదేళ్లుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న తునికాకు బోనస్‌‌‌‌‌‌‌‌ను వెంటనే చెల్లించాలని, గ్రామసభలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఆదివాసీలకు ఎస్టీ సర్టిఫికెట్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ఏజెన్సీ డీఎస్సీ ప్రకటించాలని కోరారు. పోడు సాగుదారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య, సరియం కోటేశ్వరరావు, సోయం జోగారావు, పాయం నరసింహారావు, కుంజా శ్రీను, మడివి రమేష్, దుబ్బ గోవర్ధన్, సోడెం ప్రసాద్, కొమరం కాంతారావు, కుంజా రాంమూర్తి, పోడియం వెంకటేశ్వర్లు, సర్పంచులు వగ్గేల రాధా, గంప సుజాత తదితరులు పాల్గొన్నారు.