ఆదిలాబాద్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలందరూ సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. సోమవారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో మంత్రి సమావేశమై పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, నాయకులు-కార్యకర్తల మధ్య సమన్వయంపై చర్చించారు. ప్రజల్లో పార్టీపై విశ్వాసం పెంపొందించేలా నాయకులంతా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.
నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలోనూ నాయకులందరూ ఏకాభిప్రాయంతో జాబితా సిద్ధం చేయాలని, పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పార్టీ ప్రయోజనాలు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్, ఆత్రం సుగుణ, దండే విఠల్, నారాయణరావు పాటిల్, విఠల్ రెడ్డి, సోయం బాపురావు, ఆత్రం సక్కు, విశ్వప్రసాద్, శ్రీహరి రావు, శ్యామ్ నాయక్, కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్ తదితరులు పాల్గొన్నారు.
