ఏపీలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు : ఏడుగురు స్పాట్ డెడ్

ఏపీలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు : ఏడుగురు స్పాట్ డెడ్

ఆంధ్రప్రదేశ్‌లో  నవంబర్ 24న మంగళవారం తెల్లవారుజామున రెండు జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. విజయనగరం, పల్నాడు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో థార్ వాహనం ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందగా, పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో కారు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప మాలధారులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలతో ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

భోగాపురం వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

విజయనగరం జిల్లా భోగాపురం మండలం జాతీయ రహదారిపై  ఇవాళ(మంగళవారం) ఉదయం 7:30 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీముఖలింగం వెళ్లి తిరిగి వస్తున్న థార్ వాహనం రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో థార్ వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లాలోని మధురవాడ, తగరపువలస, భీమిలి ప్రాంతాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు  థార్ వాహనంలో మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో శ్రీముఖలింగం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నాతవలస టోల్ గేట్ దాటిన అనంతరం సుందరపేట గ్రామం వద్ద రహదారిపై నిలిపి ఉన్న ట్యాంకర్ లారీని ఢీకొట్టారు.ఈ  ప్రమాదంలో వాకలపూడి శ్రీను, కుసుమ రంజని, బొర్రా సతీష్, బొర్రా శృతి, భీమిలికి చెందిన కొండపు సూరిబాబు మృతి చెందారు.

సమాచారం అందుకున్న విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ ఐపీఎస్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. థార్ వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను పోలీసులు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు క్రేన్ల సహాయంతో బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించిన ఎస్పీ.. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని విజయనగరం డీఎస్పీని ఆదేశించారు.

పల్నాడు జిల్లాలో  ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి

మరోవైపు పల్నాడు జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రోసూరు మండలం ఊటుకూరు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప మాలధారులు ప్రాణాలు కోల్పోయారు. క్రోసూరుకు చెందిన దాడి పూర్ణచంద్ర (50), దగ్గుబాటి శ్రీనివాసరావు (48) మరో ఇద్దరితో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. అమరావతిలోని ఆలయానికి వెళ్లి రాత్రి అక్కడ నిద్రించి తిరిగి వస్తుండగా ఊటుకూరు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పూర్ణచంద్ర, శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న క్రోసూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.