అంగరంగ వైభవంగా జరిగే పెళ్లిళ్లలో ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయి. వేదికలు, డెకరేషన్స్, సెలబ్రిటీ షోలు, డెస్టినేషన్ వెడ్డింగ్‌ల కోసం భారీగా ఫ్యామిలీస్ ఖర్చు చేస్తున్నాయ్. చైనా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద పెళ్లిళ్ల మార్కెట్ భారత్‌లో ఉంది. ఏటా సుమారు రూ.10–12 లక్షల కోట్ల స్థాయిలో ఉన్న ఈ రంగంలో.. ఊహించని ఘటనల వల్ల జరిగే ఆర్థిక నష్టాన్ని తట్టుకునేందుకు 'వెడ్డింగ్ ఇన్సూరెన్స్' వైపు పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు మొగ్గు చూపుతున్నాయి. గురుగ్రామ్‌కు చెందిన రాకేశ్ మెహ్రా తన కుమార్తె పెళ్లి కోసం ఇప్పటికే రూ.25 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించారు. గతేడాది ఒక స్నేహితుడి ఇంట్లో హాస్పిటలైజేషన్ వల్ల పెళ్లి వాయిదా పడి, ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడంతో ఆయన ముందస్తు రక్షణగా ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకున్నారు.
వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీలు నాన్-రిఫండబుల్ వేదిక బుకింగ్‌లు, క్యాటరింగ్, డెకరేషన్, ఫొటోగ్రఫీ, ప్రయాణాలు, కళాకారుల అడ్వాన్స్‌లకు రక్షణ కల్పిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, తుపానులు, అకాల వర్షాలు, అగ్ని ప్రమాదాలు, వధూవరులు లేదా అత్యంత సన్నిహితులకు ప్రాణాపాయం కలిగే అత్యవసర వైద్య పరిస్థితులు, ఆసుపత్రిలో చేరడం వంటి కారణాలతో పెళ్లి రద్దు లేదా వాయిదా పడితే క్లెయిమ్ వర్తిస్తుంది. అల్లర్లు, కర్ఫ్యూలు, తప్పించుకోలేని ప్రయాణ అంతరాయాలనూ కొన్ని పాలసీలు కవర్ చేస్తాయి. వేదిక వద్ద ఉంచే నగలు, క్యాష్ దొంగతనం, స్టేజ్, లైటింగ్, సౌండ్ పరికరాలు, దుస్తుల నష్టంతో పాటు అతిథులకు గాయాలు, ఆస్తి నష్టం జరిగితే థర్డ్-పార్టీ లయబిలిటీ రక్షణ కూడా లభిస్తుంది. డెస్టినేషన్ పెళ్లిళ్లకు కూడా స్థలం, రిస్క్ వివరాలను ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేసి ఆమోదం పొందితే కవరేజీ దక్కుతుంది.
ఈ మ్యారేజ్ ఇన్సూరెన్స్ అన్ని రకాల నష్టాలకు పరిహారం కాదని గుర్తుంచుకోవాలి. మనసు మార్చుకోవడం, కుటుంబ విభేదాలు, సాధారణ కాలానుగుణ వాతావరణం, ముందు నుంచే ఉన్న ఆరోగ్య సమస్యల వల్ల పెళ్లి ఆగిపోతే పాలసీ వర్తించదు. ఉద్దేశపూర్వక విధ్వంసం, మోసం, నిర్లక్ష్యం లేదా చట్టవిరుద్ధ చర్యల వల్ల వచ్చే నష్టాలనూ మినహాయిస్తారు. నగలు లేదా విలువైన వస్తువులను అజాగ్రత్తగా వదిలేసినా, పాలసీ సూచించిన భద్రతా నియమాలు పాటించకపోయినా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ALSO READ : ట్రంప్ AIతో విచిత్రమైన పోస్టు..!
సమ్ ఇన్సూర్డ్, ప్రీమియం లెక్కలు
వెడ్డింగ్ ఇన్సూరెన్స్ సాధారణంగా ఇండెమ్నిటీ పద్ధతిలో పనిచేస్తుంది. అంటే పెళ్లి ఆగిపోయినంత మాత్రాన నిర్ణీత మొత్తం కాకుండా.. వాస్తవంగా జరిగిన నష్టానికి మాత్రమే పరిహారం చెల్లిస్తారు. తిరిగి రాని అడ్వాన్స్‌లు, విమాన రద్దు రుసుములు, వేదిక వద్ద ఉండే నగలను లెక్కించి సమ్ ఇన్సూర్డ్ నిర్ణయించాలి. రద్దు ఖర్చులు, నగలు, థర్డ్-పార్టీ లయబిలిటీకి విడివిడిగా లిమిట్స్ ఉంటాయి. ఉదాహరణకు రూ.20 లక్షల బడ్జెట్లో సగం నష్టం వచ్చే అవకాశం ఉంటే.. దాని ఇన్సూరెన్స్ కి సుమారు రూ.6,000–8,000 ప్రీమియం ఉండవచ్చు. సాధారణంగా సమ్ ఇన్సూర్డ్‌లో 2–3 శాతం వరకు ప్రీమియం ఉంటుంది.
