మతాంతర వివాహాలను.. హిందూచట్టం కింద నమోదు చేయలేం: మద్రాస్ హైకోర్టు

మతాంతర వివాహాలను.. హిందూచట్టం కింద నమోదు చేయలేం: మద్రాస్ హైకోర్టు

మతాంతర వివాహాల నమోదుపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు నిచ్చింది. హిందువుకు, క్రైస్తవుడికి మధ్య జరిగే వివాహాన్ని హిందూ వివాహ చట్టం–1955 ప్రకారం నమోదు చేయడం కుదరదని స్పష్టం చేసింది. ఈ చట్టం ఇద్దరు హిందువుల మధ్య జరిగే వివాహాలకు మాత్రమే వర్తిస్తుందని తేల్చిచెప్పింది.

హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం నిర్దేశించిన అర్హతలు లేని వివాహాన్ని, సెక్షన్ 8 కింద రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా చెల్లుబాటు చేయలేమని జస్టిస్‌లు సి.వి. కార్తికేయన్, ఎస్. రవికుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. 2009 ఫిబ్రవరిలో ఓ మహిళతో జరిగిన తన వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన అప్పీలుపై ఈ తీర్పు ఇచ్చింది.

విచారణలో భాగంగా 1998, 2006లో జారీ చేసిన బాప్టిజం సర్టిఫికెట్లను పరిశీలించిన ధర్మాసనం.. వివాహం నమోదైన సమయంలో అప్పీలుదారు క్రైస్తవుడిగా ఉన్నట్లు నిర్ధారించింది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్‌కు ముందు ఎలాంటి వివాహ వేడుక జరగలేదని గుర్తించింది. వివాహ ధ్రువీకరణ పత్రంలో అందుకు భిన్నంగా వివరాలు ఉన్నప్పటికీ, చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో రిజిస్ట్రేషన్ చెల్లదని స్పష్టం చేసింది.

క్రైస్తవులు, ఇతర మతాల వారికి మధ్య వివాహాలు జరగాలంటే 1872 నాటి భారత క్రైస్తవ వివాహ చట్టంలోని విధానాలను పాటించాలని కోర్టు తెలిపింది. అలాగే 1954 నాటి ప్రత్యేక వివాహ చట్టం కూడా అంతర్‌మత వివాహాలకు అవకాశం కల్పిస్తుందని పేర్కొంది. తమిళనాడులో ఆత్మగౌరవ వివాహాలను గుర్తించే సెక్షన్ 7A కూడా ఇరు పక్షాలు హిందువులై ఉన్నప్పుడే వర్తిస్తుందని వివరించింది.

ALSO READ : FIR నమోదు చేయలేదని పోలీసుకు శిక్ష.. సెషన్స్‌ జడ్జిపై సుప్రీంకోర్టు ఆగ్రహం

గుల్లిపిల్లి సౌరియా రాజ్ వర్సెస్ బండారు పావని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ తీర్పును రాష్ట్రంలోని వివాహ రిజిస్ట్రార్లందరికీ పంపించాలని ఆదేశించింది.