FIR నమోదు చేయలేదని పోలీసుకు శిక్ష.. సెషన్స్‌ జడ్జిపై సుప్రీంకోర్టు ఆగ్రహం

FIR నమోదు చేయలేదని పోలీసుకు శిక్ష.. సెషన్స్‌ జడ్జిపై సుప్రీంకోర్టు ఆగ్రహం
  • చట్టం తెలియకుండా  బాహుబలిలా వ్యవహరించొద్దు!.. 
  • బిహార్‌‌‌‌ సెషన్స్‌‌‌‌ జడ్జిపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ: బిహార్‌‌‌‌కు చెందిన ఓ సెషన్స్‌‌‌‌ జడ్జి వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టం తెలియకుండా ‘బాహుబలి’లా వ్యవహరించొద్దని హెచ్చరించింది. ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేయలేదన్న కారణంతో పోలీసు అధికారికి శిక్ష విధించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ వ్యవహారంపై సదరు న్యాయాధికారి దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను సీజేఐ జస్టిస్‌‌‌‌ సూర్యకాంత్‌‌‌‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. 

ఈ సందర్భంగా జస్టిస్‌‌‌‌ జోయ్‌‌‌‌మాల్య బాగ్చి స్పందిస్తూ.. ‘‘చట్టంపై మీ అవగాహన నిజంగా తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ఎస్పీని పిలిపించి, అదేరోజు దోషిగా తేల్చిన మీ వైఖరి ఆందోళన కలిగిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. 

అసలేం జరిగింది?

ఓ కేసులో ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేయాలని పోలీసులను సెషన్స్‌‌‌‌ జడ్జి ఆదేశించారు. ఆ ఆదేశాలు అమలు చేయలేదనే కారణంతో కోర్టు ధిక్కార నేరంగా పరిగణించి, ఆ అధికారికి జరిమానా విధించారు. దీనిపై విచారణ సందర్భంగా సెషన్స్‌‌‌‌ కోర్టు అనుసరించిన విధానాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

‘కోర్టు ఎదుట జరిగిన నేరాలు’ అంటే తెలియదా?

కోర్టు ధిక్కారానికి సంబంధించిన చట్టపరమైన పరిధిని, బీఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ సెక్షన్‌‌‌‌ 384, సీఆర్‌‌‌‌పీసీ సెక్షన్‌‌‌‌ 345లోని నిబంధనలను ముందుగా అర్థం చేసుకోవాలని జస్టిస్‌‌‌‌ బాగ్చి సూచించారు. కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో ఎవరైనా మరొకరిని కొట్టడం, దుర్భాషలాడటం లేదా న్యాయమూర్తి ఆదేశించినా కోర్టు గది నుంచి బయటకు వెళ్లకపోవడం వంటి ఘటనలను కోర్టు ఎదుట జరిగిన నేరాలుగా పరిగణించవచ్చని వివరించారు. అయితే కోర్టు వెలుపల ఇచ్చిన ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నమోదు ఆదేశాలను అధికారి అమలు చేయకపోవడం ఈ కోవలోకి రాదని స్పష్టం చేశారు.