వెండితెరపై విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్ రవికి కోర్టు షాక్ ఇచ్చింది. ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ కేరళలోని త్రిసూర్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆయనకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు, రూ.50 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. దాదాపు నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసులో తాజాగా వెలువడిన తీర్పు మలయాళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
అసలు ఆరోజు ఏం జరిగింది?
2022, జూలై 4న కేరళలోని త్రిసూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న 10, 14 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలను నటుడు శ్రీజిత్ రవి తన కారులో వెంబడించినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అనంతరం వారి ఎదుట తన ప్రైవేట్ భాగాలను చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, బాలికలను బెదిరించినట్లు పేర్కొంది. ఈ ఘటన గురించి చిన్నారులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి జూలై 7న శ్రీజిత్ రవిని అరెస్ట్ చేశారు.
అయితే, ఈ కేసు నుంచి తప్పించాలని కోరుతూ 2022లోనే శ్రీజిత్ రవి ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడా ఊరట లభించలేదు. ఫలితంగా కేసు విచారణ కొనసాగి, తాజాగా త్రిసూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారిస్తూ ఏడాది జైలు శిక్ష విధించింది.
బాలికల వాంగ్మూలాలే కీలకం..
ఈ కేసు విచారణలో ఇద్దరు బాధిత బాలికల వాంగ్మూలాలు కీలకంగా మారాయి. వారు నిందితుడిని గుర్తించి, తమకు ఎదురైన ఘటనను కోర్టుకు వివరించారు. అయితే, బాలికలకు నటుడి పేరు తెలియకపోవడాన్ని శ్రీజిత్ రవి తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కోర్టు.. పేరు తెలియకపోయినా నిందితుడిని గుర్తించి, అతడి రూపాన్ని వివరించడం వారి వాంగ్మూలాల విశ్వసనీయతను తగ్గించదని స్పష్టం చేసింది. మరోవైపు, పోలీసులు సీసీటీవీ ఫుటేజీ సేకరించకపోవడం వంటి దర్యాప్తు లోపాలను గుర్తించినప్పటికీ, అవి బాలికల వాంగ్మూలాలను తోసిపుచ్చడానికి కారణం కాదని పేర్కొంది. ఈ కేసులో మొత్తం 21 మంది సాక్షులను విచారించారు.
#Keralam : Actor Sreejith Ravi sentenced to one year in POCSO case Actor #SreejithRavi has been sentenced to one year in prison and fined ₹50,000 by the Thrissur Fast Track Special Court-II in a POCSO case involving the sexual exposure of two minor girls in Thrissur in 2022. The case relates to an incident on July 4, 2022, when the actor allegedly exposed himself to two girls, aged nine and 14, who were walking near S.N. Park at Ayyanthole. According to the prosecution, Sreejith Ravi arrived at the spot in a black car, got out and exposed himself to the children. The girls provided the police with details of the vehicle and the time of the incident. They did not recognise him as a film actor. The police subsequently examined CCTV footage from the area and traced the vehicle, leading to his arrest. A charge sheet was filed after the investigation. During the trial, the defence argued that the actor was undergoing treatment for certain mental health issues and that the incident occurred when there was a lapse in his treatment. However, the court did not accept the argument and found him guilty. The actor had earlier been granted bail in the case. The court also stipulated that an appeal against the verdict should be filed within four months.
— South First (@TheSouthfirst) November 23, 2026
ఏడాది జైలు శిక్ష.. రూ.50 వేల జరిమానా
ఈ కేసును విచారించిన త్రిసూర్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు-II న్యాయమూర్తి రమ్య మీనన్.. శ్రీజిత్ రవిని దోషిగా నిర్ధారించారు. ఐపీసీ సెక్షన్ 509, పోక్సో చట్టంలోని సెక్షన్ 11(i), 12 కింద నేరం రుజువు కావడంతో ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో నెల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. జరిమానా వసూలైతే ఆ మొత్తాన్ని ఇద్దరు బాధిత బాలికలకు చెరో రూ.25 వేల చొప్పున పరిహారంగా అందించాలని కోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టులో అప్పీల్‌కు సిద్ధమైన నటుడు..
కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేరళ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు శ్రీజిత్ రవి తెలిపారు. దీంతో అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా ట్రయల్ కోర్టు ఆయన శిక్ష అమలును నెల రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసింది. రూ.50 వేల బాండ్‌తో పాటు ఇద్దరు షూరిటీలపై బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 23, 2026న తిరిగి కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, శిక్ష అమలుపై తాత్కాలిక నిలుపుదల లభించినంత మాత్రాన ఆయన నిర్దోషిగా విడుదలైనట్లు కాదు. హైకోర్టులో అప్పీల్ ద్వారా తనపై వచ్చిన తీర్పును సవాల్ చేయాల్సి ఉంది.
ఎవరీ శ్రీజిత్ రవి?
ప్రముఖ మలయాళ నటుడు టి.జి. రవి కుమారుడే శ్రీజిత్ రవి. 2005లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన మలయాళంతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించారు. ముఖ్యంగా విలన్, సహాయ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. 'పుణ్యాలన్ అగర్బత్తీస్', 'గోధా', 'రమంటే ఎదంతోటం', 'జో అండ్ జో' వంటి పలు చిత్రాల్లో నటించారు. ఇప్పటివరకు 70కి పైగా సినిమాల్లో కనిపించిన శ్రీజిత్ రవి కెరీర్‌లో ఈ పోక్సో కేసు తీర్పు తీవ్ర ప్రభావం చూపే పరిణామంగా మారింది.
