సీఎం రేవంత్ నీళ్లు ఎత్తిపోస్తలేడు..దుమ్మెత్తిపోస్తుండు.. సీఎంపై హరీశ్ రావు ఫైర్

సీఎం రేవంత్ నీళ్లు ఎత్తిపోస్తలేడు..దుమ్మెత్తిపోస్తుండు.. సీఎంపై హరీశ్ రావు ఫైర్

తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డిపై  మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ ప్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని, తెలంగాణను అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నీళ్లు ఎత్తిపోయాల్సిన ముఖ్యమంత్రి.. దుమ్ము ఎత్తిపోస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏజెంట్ ఆదిత్యనాథ్‌ను సీఎం పక్కన పెట్టుకున్నారని విమర్శించారు.

తెలంగాణను ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని హరీశ్ రావు మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ నేతలు ఏపీ నాయకులకు కట్టుబానిసల్లా వ్యవహరించారని ఆరోపించారు. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాగే వ్యవహరించారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సాగర్ ఎడమ కాలువకు ఒక నీతి, కుడి కాలువకు మరో నీతా అని నిలదీశారు.

తెలంగాణ కోసం పోరాడింది గులాబీ జెండానేనని హరీశ్ రావు స్పష్టం చేశారు. గులాబీ జెండా పుట్టిందే నీళ్ల కోసం అని పేర్కొన్నారు. తెలంగాణకు అర్థరాత్రి కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పుకోవడం విడ్డూరమని విమర్శించారు. కేసీఆర్ నిలదీసిన తర్వాతే సాగర్ ఎడమ కాలువ లిఫ్టులను ప్రభుత్వం నిర్వహించిందని అన్నారు. ఎస్సారెస్పీ ఆయకట్టును పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు.

ఒకప్పుడు తుమ్మలు, పిచ్చిమొక్కలు మొలిచిన కాలువల్లో కేసీఆర్ నీళ్లు పారించారని హరీశ్ రావు పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిందని తెలిపారు. పల్లేర్లు మొలిచిన పాలమూరు ప్రాంతంలో కృష్ణా జలాలను పారించామని, జిల్లా ప్రాజెక్టుల కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.

750 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి చంద్రబాబు కృష్ణా జలాలను తరలించారని హరీశ్ రావు ఆరోపించారు. గురుదక్షిణ కింద కృష్ణా జలాలను ఏపీకి ధారపోస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం వల్లే పాలమూరు జిల్లాలో క్రాప్ హాలిడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. సాగునీటి విషయంలో తెలంగాణ రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.