ఎమ్మెల్యేపై కలెక్టర్ ఫిర్యాదు..తమిళనాడు ప్రభుత్వంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

ఎమ్మెల్యేపై కలెక్టర్ ఫిర్యాదు..తమిళనాడు ప్రభుత్వంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌పై టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ఈ విషయంలో ఎవరినైనా కాపాడుతోందా అని జస్టిస్ లక్ష్మీనారాయణ మంగళవారం ప్రశ్నించారు. ఈ వేధింపులపై జులై 31నే సమాచారం ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని జస్టిస్ ప్రశ్నించారు. కలెక్టర్ ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంపై విచారణకు తక్షణమే కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మహిళ ఏ స్థాయిలో ఉన్నా ఆమెకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

బాధితురాలి వివరాలు సోషల్ మీడియాలో ప్రచారమవ్వడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్ విభాగం చురుగ్గా పనిచేయాలని, ఒకసారి నష్టం జరిగిన తర్వాత చేసేదేమీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేపై మంగళవారమే ఎఫ్ఐఆర్ నమోదైనట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ జాన్ సత్యన్ కోర్టుకు తెలిపారు. ఈ కేసును జిల్లా ఎస్పీ కన్నా ఉన్నతాధికారితో విచారణ జరిపించాలని కోర్టు సూచించింది.

తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ ఖండించారు. ఇవి రాజకీయ ప్రేరేపితమైనవని ఆయన చెప్పారు. ఈ అంశంపై డీఎంకే ఎంపీ కనిమొళి ఆందోళన వ్యక్తం చేయగా, నవంబర్ 12న ప్రతిపక్ష పార్టీలు కూడా అధికారులకు ఫిర్యాదు చేశాయి.

కేసు వివరాల్లోకి ..

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ ను వేధించారని ,అసభ్యకరమైన సందేశాలు పంపారని ఆరోపిస్తూ TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌పై నవంబర్ 23, 2026న అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కళ్లకురిచ్చి మహిళా పోలీసులు ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.మూడు నెలల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ తన వస్త్రధారణపై వ్యాఖ్యలు చేయడమే కాకుండా అనుచితంగా ప్రవర్తించారని ,తన ప్రైవసీకి భంగం కలిగించేలా వ్యవహరించారని కలెక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎమ్మెల్యే మద్యం మత్తులో కలెక్టర్ అధికారిక నివాసంలోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరించారని సోషల్ మీడియాలో , ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఆరోపణలు వచ్చాయి. అయితే, కలెక్టర్ పోలీసులకు ఇచ్చిన అధికారిక ఫిర్యాదులో తన నివాసంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు ఎక్కడా ప్రస్తావించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ALSO READ : ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ: ఒక్కరోజులో ట్రంప్‌కు రూ.140 కోట్లు లాభం!

అయితే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండించారు. ఇది రాజకీయ కుట్ర అని అన్నారు. తనను ,అధికార పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.