ఓనర్‌కు తెలియకుండా AI లేఆఫ్స్ ఇచ్చేసింది.. ఉద్యోగులకు సారీ చెప్పిన బ్యాంక్!

ఓనర్‌కు తెలియకుండా AI లేఆఫ్స్ ఇచ్చేసింది.. ఉద్యోగులకు సారీ చెప్పిన బ్యాంక్!

యాజమాన్యానికి తెలియకుండానే ఓ ఏఐ సిస్టమ్ ఉద్యోగులకు లేఆఫ్ మెయిల్స్ పంపేసి అందరినీ షాక్‌కి గురిచేసింది. ఈ ఘటన ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కలకలం రేపుతోంది. సాధారణంగా ఉద్యోగులను తొలగించే ముందు హెచ్ఆర్ లేదా మేనేజర్లు వ్యక్తిగతంగా మాట్లాడి సమాచారం ఇస్తారు. కానీ నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్‌లో మాత్రం టెక్నాలజీ చేసిన పొరపాటు వల్ల కొందరు ఉద్యోగులు తమ ఉద్యోగం ఊడిందన్న విషయాన్ని నేరుగా ఇన్‌బాక్స్‌లో మెయిల్ చూసి తెలుసుకోవాల్సి వచ్చింది. వాలంటరీ రిడండెన్సీ ప్యాకేజీల కోసం దరఖాస్తు చేసుకున్న సిబ్బందికి.. బ్యాంక్ అధికారికంగా నిర్ణయం చెప్పకముందే ఈ ఆటోమేటెడ్ మెయిల్స్ వెళ్లిపోయాయి.

ఈ ఊహించని తప్పిదంపై బ్యాంక్ యాజమాన్యం సోమవారం నాడు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. నిజానికి దరఖాస్తులపై తుది నిర్ణయాన్ని ముందుగా ప్రతి ఉద్యోగికి వ్యక్తిగతంగా వివరించిన తర్వాతే ఈ మెయిల్స్ వెళ్లాల్సి ఉంది. కానీ సాంకేతిక లోపం కారణంగా ఏఐ సిస్టమ్ ముందే మెయిల్స్ పంపేసిందని బ్యాంక్ స్పష్టం చేసింది. ఎంతమందికి ఇలా మెయిల్స్ వెళ్లాయనే సంఖ్యను వెల్లడించనప్పటికీ.. ఈ విధంగా ఉద్యోగ తొలగింపు వార్త తెలియడం సిబ్బందిని తీవ్ర ఆవేదనకు గురిచేసి ఉంటుందని బ్యాంక్ విచారం వ్యక్తం చేసింది. బాధిత ఉద్యోగులతో అనుకున్న సమయం కంటే ముందే మాట్లాడి నేరుగా వివరాలు అందిస్తామని హామీ ఇచ్చింది.

గత నెలలో నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్ తమ కార్యకలాపాలను సులభతరం చేసి.. ఖర్చులను తగ్గించుకునేందుకు రానున్న ఏడాదిలో 2వేల500 మంది ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలోనే ఈ సాంకేతిక గందరగోళం చోటుచేసుకుంది. గతేడాది ఆస్ట్రేలియాకే చెందిన ఏఎన్జెడ్ బ్యాంకులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 100 మందికి పైగా సీనియర్ బ్యాంకర్లకు ఉద్యోగం పోయిందని చెప్పకముందే ల్యాప్‌టాప్‌లు తిరిగి ఇచ్చేయాలని ఆటోమేటెడ్ మెయిల్స్ వెళ్లాయి.

ALSO READ : పెళ్లిళ్లకు వెడ్డింగ్ ఇన్సూరెన్స్.. ఏమేం కవర్ చేస్తుంది? ప్రీమియం ఎంత?

ప్రస్తుతం ఆస్ట్రేలియా ఉద్యోగ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. క్వాంటాస్, కాన్వా, అట్లాసియన్ వంటి దిగ్గజ సంస్థలు ఏఐ, ఆటోమేషన్ పేరుతో భారీగా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఆ దేశంలో నిరుద్యోగ రేటు 5 ఏళ్ల గరిష్ట స్థాయి 4.9 శాతానికి చేరగా.. రాబోయే నెలల్లో ఇది 5 శాతం దాటవచ్చని ఆర్థిక మంత్రి జిమ్ చామర్స్ హెచ్చరించారు. ఆర్థిక వృద్ధి మందగించడం, వడ్డీ రేట్ల పెరుగుదల ప్రభావంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో ఆటోమేటెడ్ ఏఐ సిస్టమ్స్ చేసే ఇలాంటి పొరపాట్లు ఉద్యోగులను మానసిక వేదనను గురిచేస్తున్నాయి.