బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న 'రామాయణ: పార్ట్ 1' ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. భారీ బడ్జెట్ సినిమాలను థియేటర్లలో చూడాలంటే జేబుకు చిల్లుపడాల్సిందేనని భావించే సినీ ప్రియులకు మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏకంగా సినిమా టికెట్ ధరను రూ.99కు తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది కూడా ఇవాళ నవంబర్ 24న గురునానక్ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, ఈ వారం మొత్తం కూడా టికెట్ తగ్గింపు ఆఫర్ ఉంటుందా? లేదా అనేది చూద్దాం..
రూ.300 టికెట్.. ఇప్పుడు రూ.99కే!
సాధారణంగా భారీ బడ్జెట్ చిత్రాల టికెట్ ధరలు మల్టీప్లెక్స్‌లలో అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమా చూడాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించడమే లక్ష్యంగా 'రామాయణ' టీమ్ టికెట్ ధరలను భారీగా తగ్గించింది. మేకర్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ ఆఫర్‌ను ప్రకటించారు. నవంబర్ 24, మంగళవారం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో 2D టికెట్లు రూ.99 నుంచే అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
Experience Ramayana on the big screen this Tuesday, with tickets starting at just ₹99*. Wishing everyone a blessed Gurpurab. 🙏 Book your tickets now! 🏹 Ramayana, now playing in cinemas worldwide, across all premium formats. https://t.co/UOxdBZdLcN
— The World Of Ramayana (@WorldOfRamayana) November 23, 2026
3D, ఐమ్యాక్స్ షోలపైనా డిస్కౌంట్లు!
కేవలం 2D షోలకే కాకుండా 3D, ఐమ్యాక్స్ ఫార్మాట్లలోనూ టికెట్ ధరలను తగ్గించారు. గతంలో రూ.500కు పైగా ఉన్న 3D టికెట్లు ఇప్పుడు కొన్ని థియేటర్లలో రూ.119 నుంచి రూ.249 మధ్య లభిస్తున్నాయి. ఎంపిక చేసిన ఐమ్యాక్స్ 3D స్క్రీన్లలో టికెట్లు రూ.250 నుంచే ప్రారంభమవుతున్నాయి. ప్రీమియం రెక్లైనర్ సీట్ల ధరలు మాత్రం సుమారు రూ.199 నుంచి రూ.249 వరకు ఉన్నాయి. అయితే కొన్ని ప్రీమియం స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.700-800 వరకు కొనసాగుతున్నాయి.
ఒక్కరోజేనా.. వారం రోజులూ కొనసాగుతుందా?
మొదట మంగళవారం ప్రత్యేక ఆఫర్‌గా ప్రకటించినప్పటికీ, బుక్‌మైషోలోని షో వివరాల ప్రకారం.. కొన్ని ప్రాంతాల్లో తగ్గింపు ధరలు ఈ వారం మొత్తం కొనసాగే అవకాశముంది. దేశవ్యాప్తంగా దాదాపు 4,000 స్క్రీన్లలో ఈ చిత్రం ప్రదర్శితమవుతోంది. అయితే అన్ని థియేటర్లు, అన్ని షోలకు ఒకే ధర వర్తించదు. కాబట్టి టికెట్లు బుక్ చేసుకునే ముందు బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ధరలు, షో టైమింగ్స్ వంటి అంశాలను చెక్ చేసుకుని వెళ్లడం మంచిది.
బాక్సాఫీస్ జోరు తగ్గడంతోనే ఈ నిర్ణయమా?
మరోవైపు 'రామాయణ: పార్ట్ 1' బాక్సాఫీస్ ప్రయాణంలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. విడుదలైన తొలి రోజుల్లో భారీ వసూళ్లతో దూసుకెళ్లిన ఈ సినిమా కలెక్షన్లు తాజాగా కాస్త నెమ్మదించాయి. నవంబర్ 23న సోమవారం సుమారు రూ.12.70 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు మాత్రమే సాధించినట్లు ట్రేడ్ రిపోర్టులు వెల్లడించాయి. ఆదివారం వసూళ్లతో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదల. దీంతో థియేటర్లలో ఆక్యుపెన్సీని పెంచి, మరింత మంది ప్రేక్షకులను ఆకర్షించేందుకు టికెట్ ధరల తగ్గింపు వ్యూహాన్ని మేకర్స్ అనుసరించినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రికార్డుల వేటలో రామాయణ.. రూ.1,700 కోట్లకు పైగా వసూళ్లు!
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించారు. రవీ దూబే లక్ష్మణుడి పాత్రలో కనిపించారు. విడుదలైన 19 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,700 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక రూ.99 టికెట్ ఆఫర్‌తో మరింత మంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
Witness the eternal bond of Siya Ram on the big screen. 🏹 Book your tickets now! Ramayana, now playing in cinemas worldwide, across all premium formats. https://t.co/wx13tLwtd9
— The World Of Ramayana (@WorldOfRamayana) November 22, 2026
