హైదరాబాద్ లో శుద్ధి చేసిన మురుగు నీటిని ఇతర అవసరాలకు వినియోగించాలనే లక్ష్యంతో ప్రారంభించిన గ్రీన్ ట్యాంకర్ల సేవలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖాజాగూడలో గ్రీన్ ట్యాంకర్లలోకి ఎస్టీపీలలో శుద్ధి చేసిన నీటికి బదులుగా నేరుగా నాలా మురుగు నీటిని నింపుతున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్, నిర్మాణ పనులు తదితర అవసరాలకు శుద్ధి చేసిన మురుగు నీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో జలమండలి నవంబర్ 1న గ్రీన్ ట్యాంకర్ల సేవలను ప్రారంభించింది. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించకుండా ఆదా చేయడం, శుద్ధి చేసిన వ్యర్థ జలాలను తిరిగి వినియోగంలోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
అయితే ఖాజాగూడలో మాత్రం ఈ లక్ష్యానికి విరుద్ధంగా నాలాలో ప్రవహిస్తున్న మురుగు నీటినే ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండా ట్యాంకర్లలోకి ఎక్కిస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన నీటిని నింపాల్సిన గ్రీన్ ట్యాంకర్లలోకి అసలు నాలా నీరు ఎలా చేరుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గ్రీన్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీటి నాణ్యతను ఎవరు పర్యవేక్షిస్తున్నారు? ట్యాంకర్లకు నీటిని ఎక్కడి నుంచి నింపుతున్నారు? ఎస్టీపీల నుంచి అనుమతులతో నీటిని తీసుకుంటున్నారా? లేక నాలాల నుంచి నేరుగా మురుగు నీటిని సేకరిస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శుద్ధి చేయని మురుగు నీటిని గార్డెనింగ్, నిర్మాణ అవసరాలకు వినియోగిస్తే ప్రజారోగ్యంతో పాటు పర్యావరణంపై కూడా ప్రతికూల ప్రభావాలు పడే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో ఈ ఘటనపై జలమండలి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విచారణ చేపట్టారు. నిజంగానే గ్రీన్ ట్యాంకర్లలోకి నాలా మురుగు నీటిని నింపుతున్నారా? అలా చేస్తుంటే ఎవరి అనుమతితో ఈ వ్యవహారం సాగుతోంది? ట్యాంకర్లకు నీటి సరఫరా చేసే కేంద్రాలు ఏవి? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
