Gondhal Oscar: ‘గోంధల్’కు ఆస్కార్ ఛాన్స్.. 104 చిత్రాల జాబితాలో భారత్‌కు చోటు

Gondhal Oscar: ‘గోంధల్’కు ఆస్కార్ ఛాన్స్.. 104 చిత్రాల జాబితాలో భారత్‌కు చోటు

Oscars 2027: భారతీయ సినిమా మరోసారి ప్రపంచ సినీ వేదికపై తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది. మహారాష్ట్ర మట్టి వాసన, జానపద సంప్రదాయం, ఉత్కంఠభరిత కథాంశంతో తెరకెక్కిన మరాఠీ చిత్రం ‘గోంధల్’ ఆస్కార్‌ బరిలో కీలక ముందడుగు వేసింది. 99వ అకాడమీ అవార్డుల ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఏకంగా 104 చిత్రాలు అర్హత సాధించగా.. భారత్ తరఫున అధికారికంగా ఎంపికైన ‘గోంధల్’ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. దీంతో భారతీయ సినీ అభిమానుల్లో ఆస్కార్ ఆశలు మరోసారి చిగురించాయి. అయితే, అర్హత జాబితాలో చోటు దక్కడం నామినేషన్ ఖరారైనట్లు కాదు. అసలు పోరు ఇకపై మొదలుకానుంది..

4 చిత్రాలతో రికార్డు స్థాయి పోటీ..

99వ ఆస్కార్‌ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈసారి రికార్డు స్థాయిలో 104 సినిమాలు అర్హత సాధించాయి. నవంబర్ 23న అకాడమీ ప్రకటించిన ఈ జాబితాలో 100 చిత్రాలు దేశాల అధికారిక ఎంట్రీలుగా, మరో నాలుగు సినిమాలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సాధించిన విజయాల ఆధారంగా చోటు దక్కించుకున్నాయి. ఫ్రాన్స్, స్పెయిన్, బ్రెజిల్, నార్వే, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, ఇరాన్ వంటి దేశాల చిత్రాలతో భారత్‌కు చెందిన ‘గోంధల్’ పోటీపడుతోంది. ఇంతటి అంతర్జాతీయ పోటీలో ప్రాంతీయ భాషా చిత్రంగా నిలవడం విశేషం.

ఆస్కార్‌కు ముందే అవార్డుల వేదికపై ‘గోంధల్’..

‘గోంధల్’ ఆస్కార్ ప్రయాణానికి ముందే పలు ప్రతిష్ఠాత్మక సినీ వేదికలపై గుర్తింపు తెచ్చుకుంది. 2025లో జరిగిన 56వ IFFIలో దర్శకుడు సంతోష్ దావఖర్ ఉత్తమ దర్శకుడిగా ‘సిల్వర్ పీకాక్’ అవార్డును అందుకున్నారు. అలాగే 2026లో బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ఈ చిత్రం FIPRESCI అవార్డును గెలుచుకుంది.

భారత్ తరఫున ఆస్కార్ అధికారిక ఎంట్రీని ఎంపిక చేసే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) సెప్టెంబర్ 18, 2026న 33 చిత్రాలను పరిశీలించి ‘గోంధల్‌’ను ఎంపిక చేసింది. తాజాగా ఆస్కార్ అర్హత జాబితాలోనూ చోటు దక్కించుకోవడంతో భారతీయ సినిమా ఆశలు మరింత పెరిగాయి.

ఇదీ ఆస్కార్ ప్రక్రియ!

ఆస్కార్ అర్హత జాబితాలో చోటు దక్కడం తొలి అడుగు మాత్రమే. నామినేషన్ సాధించాలంటే మరికొన్ని దశలను దాటాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీ పడే సినిమా నిడివి 40 నిమిషాలకు పైగా ఉండాలి. అమెరికా బయట నిర్మితమై ఉండటంతో పాటు, 50 శాతానికి పైగా డైలాగ్స్ ఆంగ్లేతర భాషలో ఉండాలి. ఈ కండిషన్స్ని పూర్తి చేసిన ‘గోంధల్’ ఇప్పుడు ఆస్కార్ తదుపరి దశపై ఆశలు రేకెత్తిస్తోంది.

ప్రాంతీయ కథకు ప్రపంచ వేదికపై గుర్తింపు దక్కేనా?

భారతీయ సినిమాకు ఆస్కార్ వేదిక కొత్తదేమీ కాదు. అయితే దేశంలోని ప్రాంతీయ భాషలు, స్థానిక సంస్కృతులు, జానపద సంప్రదాయాలను ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేసే సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ప్రత్యేకమైన విషయం. అలాంటి ప్రయత్నంలో భాగంగానే ‘గోంధల్’ ఇప్పుడు ప్రపంచ సినీ వేదికపై తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రాంతీయ భాషలో తెరకెక్కిన ఓ సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు కోసం పోటీపడటం భారతీయ సినీ పరిశ్రమకు ఆసక్తికర పరిణామం. మరి డిసెంబర్ 15న ప్రకటించనున్న టాప్‌-15 షార్ట్‌లిస్ట్‌లో ‘గోంధల్’ చోటు దక్కించుకుంటుందా? జనవరి 21న వెలువడే ఫైనల్ నామినేషన్లలో నిలుస్తుందా? అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

‘గోంధల్’ కథ?

మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే జానపద ఆచారం ‘గోంధల్’. రాత్రివేళ నిర్వహించే ఈ సంప్రదాయ కార్యక్రమంలో సంగీతం, నృత్యం, పురాణ గాథలు, ఆధ్యాత్మిక అంశాలు మిళితమై ఉంటాయి. ఈ ప్రత్యేకమైన సాంస్కృతిక నేపథ్యాన్నే దర్శకుడు సంతోష్ దావఖర్ తన సినిమా కథకు కేంద్రబిందువుగా ఎంచుకున్నారు.

ఒకే ఒక్క రాత్రిలో జరిగే సంఘటనల చుట్టూ ఈ థ్రిల్లర్ కథ సాగుతుంది. సుమన్ (ఇషితా దేశ్‌ముఖ్) సంపన్నుడైన ఆనంద్‌తో ఇష్టం లేని వివాహ బంధంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది. అదే సమయంలో గోంధాలి కళాకారుడైన సాహెబాతో ఆమె ప్రేమలో పడుతుంది. ఈ బంధం నుంచి బయటపడేందుకు సుమన్ చేసే ప్రయత్నాలు, ఆనంద్ బంధువైన సర్జేరావ్ ప్రమేయంతో ప్రమాదకరమైన మలుపు తీసుకుంటాయి. ప్రేమ, ఆశ, మోసం, హత్య, కుట్ర, ప్రాణాల కోసం పోరాటం.. ఇలా అనేక భావోద్వేగాలతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. 

ఈ చిత్రంలో ఇషితా దేశ్‌ముఖ్‌తో పాటు కిషోర్ కదమ్, యోగేష్ సోహోని, నిషాద్ భోయిర్, అనుజ్ ప్రభు కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించడం మరో ప్రత్యేకత. మరాఠీ భాషలో తెరకెక్కిన ఈ సినిమా నిడివి రెండు గంటలు.