Vijay Antony : హైదరాబాద్ వీధుల్లో 'బిచ్చగాడు' హీరో సందడి.. స్వయంగా మిర్చి బజ్జీలు వేసిన విజయ్ ఆంటోనీ!

Vijay Antony : హైదరాబాద్ వీధుల్లో 'బిచ్చగాడు' హీరో సందడి.. స్వయంగా మిర్చి బజ్జీలు వేసిన విజయ్ ఆంటోనీ!

సినిమా ప్రమోషన్స్ ట్రెండ్ మారుతోంది. భారీ ఈవెంట్లు, స్టార్ హోటళ్లలో ప్రెస్ మీట్లు, మీడియా ఇంటర్వ్యూలు పక్కన పెట్టేసి రొటీన్‌కు భిన్నంగా కొందరు హీరోలు నేరుగా ప్రేక్షకుల మధ్యకు వచ్చేస్తున్నారు. ఈ విషయంలో 'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటారు. లేటెస్ట్ గా తన కొత్త సినిమా 'నాన్న కుట్టి' ప్రమోషన్ల కోసం ఆయన చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ అమీర్‌పేట వీధుల్లో సామాన్యుడిలా తిరుగుతూ.. స్వయంగా మిర్చి బజ్జీలు వేస్తూ, ఇరానీ చాయ్ తాగుతూ సందడి చేశారు.

సోమవారం సాయంత్రం హీరోయిన్ ప్రీతి ఆస్రానీతో కలిసి అమీర్‌పేటకు చేరుకున్న విజయ్ ఆంటోనీ ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా స్థానికులతో కలిసిపోయారు. ఓ చిరు వ్యాపారి బండి దగ్గరకు వెళ్లి స్వయంగా మిర్చి బజ్జీలు వేయడం మొదలుపెట్టారు. అంతేకాదు.. వేడివేడి బజ్జీలను అక్కడున్న వారికి స్వయంగా అందించారు. స్టార్ హీరో తమ మధ్యకు వచ్చి ఇలా బజ్జీలు వేయడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. అభిమానులు ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడటంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

ALSO READ : Ramayana Ticket: రూ.99కే రామాయణ టికెట్.. ఇవాళ ఒక్కరోజేనా? వారం మొత్తం ఆఫర్ ఉందా?

అంతటితో ఆగకుండా విజయ్ ఆంటోనీ, ప్రీతి ఆస్రానీ కలిసి ఏషియన్ సత్యం మాల్ సమీపంలోని ఓ ఇరానీ కేఫ్‌కు వెళ్లారు. అక్కడ సాధారణ కస్టమర్ల మాదిరిగా కూర్చుని ఇరానీ చాయ్‌తో పాటు బన్ మస్కాను ఆస్వాదించారు. అభిమానులతో ఆప్యాయంగా మాట్లాడి ఫొటోలు దిగారు. ఈ విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం చెన్నై నుంచి కోయంబత్తూరుకు సాధారణ రైలులో జనరల్ బోగీలో ప్రయాణించి విజయ్ ఆంటోనీ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు హైదరాబాద్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ప్రమోషన్లు నిర్వహించారు. ఖరీదైన హోటళ్లలో కూర్చుని సినిమా గురించి చెప్పడం కంటే.. ప్రజల్లోకి వెళ్లి వారి జీవితాల్లో భాగం కావడమే తన ప్రమోషన్ స్టైల్ అని విజయ్ ఆంటోనీ నిరూపిస్తున్నారు. మరి ఈ వినూత్న ప్రచారం 'నాన్న కుట్టి' సినిమాకు ఎలాంటి బజ్ తీసుకొస్తుందో చూడాలి..