టీటీడీ అలర్ట్..డిసెంబర్ 20 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు.. నవంబర్  27 నుంచి రిజిస్ట్రేషన్లు

టీటీడీ అలర్ట్..డిసెంబర్ 20 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు.. నవంబర్  27 నుంచి రిజిస్ట్రేషన్లు

తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్ డేట్ ఇచ్చింది.  కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసింది. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. ఈసారి సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేలా టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

మొదటి రెండు రోజులకు లక్కీ డిప్ విధానం

వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా డిసెంబర్ 20, 21 తేదీలకు సంబంధించిన దర్శన టోకెన్లను లక్కీ డిప్ విధానంలో కేటాయించనున్నారు. ఇందుకోసం నవంబర్ 27వ తేదీన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న అనంతరం లక్కీ డిప్ ద్వారా ఎంపికైన వారికి దర్శన టోకెన్లు కేటాయించనున్నారు.

డిసెంబర్ 22 నుంచి 29వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు టోకెన్లు లేకుండానే తిరుమలకు నేరుగా వచ్చే సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. దీంతో వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో సాధారణ భక్తులకు పెద్దపీట వేయాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరోవైపు పది రోజుల పాటు రోజుకు 15 వేల చొప్పున మొత్తం లక్షా 50 వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేయాలని టీటీడీ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ టికెట్ల విడుదల తేదీలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రివిలేజ్ దర్శనాలు రద్దు

వైకుంఠ ద్వార దర్శనాలు జరిగే పది రోజుల పాటు ప్రివిలేజ్ దర్శనాలను టీటీడీ రద్దు చేయనుంది. నేరుగా వచ్చే వీఐపీలకు మాత్రమే దర్శన అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలో ఆయనతో చర్చించిన అనంతరం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల తేదీలను టీటీడీ ప్రకటించనున్నట్లు సమాచారం.

గత ఏడాది వైకుంఠ ద్వారం ద్వారా మొత్తం 7,83,413 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది ఆ సంఖ్యను మరింత పెంచి 8.34 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

సామాన్య భక్తులకు 92 శాతం దర్శనాలు

వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా మొత్తం దర్శనాల్లో 92 శాతం సామాన్య భక్తులకు కేటాయించేలా టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దర్శనాలు, క్యూ లైన్లు, ఇతర సౌకర్యాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.