హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఇక నుంచి కంజెషన్ ఛార్జీలు.. కారులో ఒక్కరే వెళ్తే..

హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఇక నుంచి కంజెషన్ ఛార్జీలు.. కారులో ఒక్కరే వెళ్తే..

  రోజు రోజుకూ పెరిగిపోతున్న హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణపై సంచలన నివేదిక వెల్లడైంది. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ తగ్గాలంటే ఇకనుంచి కంజెషన్ ఛార్జీలు వసూలు చేయాలని నివేదిక పేర్కొంది.  అత్యంత రద్దీ ఉన్న రోడ్లపై కంజెషన్ ఛార్జీ వసూలు చేస్తే ప్రయాణ సమయం తగ్గుతుందని, ఆ నిధులను పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అభివృద్ధికి వినియోగిస్తే కారు ప్రయాణికులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని కొత్త అధ్యయనం తెలిపింది.

ఈ నివేదిక ప్రకారం.. కారులో ఒక్కరే ప్రయాణిస్తే జరిమానా విధించాలని నివేదిక పేర్కొంది. హైదరాబాదులో హైటెక్ సిటీలాంటి రద్దీగా ఉండే ఏరియాల్లో గంటకు10 వేలకు పైగా వాహనాలు వెళ్తుండగా.. 6 వేల 500 వాహనాల్లో డ్రైవర్ ఒక్కరే వెళ్తున్నట్లు నివేదిక తెలిపింది. దీంతో ట్రాఫిక్ పెరుగుతున్నట్లు పేర్కొంది. కంజెషన్ ఛార్జీలు వేయటం ద్వారా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపవచ్చునని పేర్కొంది. 

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) పిలాని హైదరాబాద్ క్యాంపస్, కార్డిఫ్ యూనివర్సిటీ, కింగ్ ఫహద్ యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ మినరల్స్ పరిశోధకులు కలిసి ఈ అధ్యయనం చేశారు. దీనికి భారత ప్రభుత్వం నిధులు సమకూర్చింది. బిట్స్ పిలానిలోని ట్రాన్స్‌పోర్టేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్ (TRIAL) ప్రొఫెసర్లు ప్రశాంత సాహు, బంధన్ మజుందార్ నాయకత్వంలో ప్రొఫెసర్ డిమిట్రిస్ పోటోగ్లూ, డాక్టర్ నవీద్ మరాజీతో కలిసి ఈ పరిశోధన జరిగింది.

435 మంది కారు ప్రయాణికులను సర్వే చేశారు. కంజెషన్ ఛార్జీ వల్ల ప్రయాణ సమయం తగ్గుతుందనేదే వారు ఎక్కువగా ఆశించిన ప్రయోజనం. ఉద్యోగ కేంద్రాలు, వాణిజ్య ప్రాంతాలు, మెట్రో జంక్షన్లు, రద్దీగా ఉండే కూడళ్లకు సమీపంలో ఉన్న కారిడార్లలో మొదట ఈ విధానాన్ని అమలు చేయాలని పరిశోధకులు సూచించారు.

రద్దీ అనేది కేవలం వాహనాల సంఖ్యతోనే సంబంధం కాదని ప్రొఫెసర్ సాహు అన్నారు.   అసమాన రోడ్డు వెడల్పులు, పాదచారుల సౌకర్యాలు లేకపోవడం, రోడ్డు పక్కన పార్కింగ్, బస్ స్టాప్‌ల కార్యకలాపాలు, సరిగా రూపొందించని జంక్షన్లు కూడా ఆలస్యానికి కారణమవుతున్నాయని ఆయన వివరించారు. అత్యంత రద్దీ ఉన్న కారిడార్లపై ఛార్జీ విధించడంతో పాటు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను మెరుగుపరచడం, గ్రేడ్ సెపరేటెడ్ జంక్షన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆలస్యాలు, కాలుష్యం, ఇంధన వృధా తగ్గుతాయని ఆయన అన్నారు.

ప్రయాణికులు సమయం ఆదా, గాలి శుభ్రత, రోడ్డు భద్రత, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బలోపేతం జరుగుతుందని నమ్మితే ఛార్జీని అంగీకరిస్తారని ప్రొఫెసర్ మజుందార్ చెప్పారు. ఈ ఆదాయంతో మరిన్ని బస్సులు, ఫీడర్ సర్వీసులు, మెరుగైన ఫుట్‌పాత్‌లు, రోడ్డు భద్రతా పనులు, పరిశుభ్రమైన రవాణా ఎంపికలకు నిధులు సమకూర్చవచ్చని ఆయన తెలిపారు.

 కేవలం రోడ్లు వెడల్పు చేయడం కాదు.. 

అన్ని చోట్ల రోడ్లు వెడల్పు చేయడం కంటే పదేపదే క్యూలు ఏర్పడే ప్రాంతాలను గుర్తించి ముందుగా వాటిని సరిదిద్దాలని అధ్యయనం హెచ్చరించింది. టర్నింగ్ మూమెంట్లు, జంక్షన్ సామర్థ్యం తక్కువగా ఉన్న చోట్ల గ్రేడ్ సెపరేటెడ్ జంక్షన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

 పెరుగుతున్న వాహనాల సంఖ్య

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో కలిసి 2025లో 94 లక్షల  78  వేల రిజిస్టర్డ్ వాహనాలు ఉన్నాయి. 2024లో 89.89 లక్షలు ఉండగా ఇలా పెరిగాయి. 2026 చివరికి ఒక కోటికి చేరుకుంటాయని అంచనా.

ALSO READ : టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు కదా.. హైవేలపై పశువులు రాకుండా చేయలేరా..!

ఐటీ కారిడార్‌లో పైలట్‌ పైలట్ ప్రాజెక్టుగా అమలు

పీక్ అవర్స్‌లో భారీగా వాహనాలు ప్రవహించే ఐటీ కారిడార్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకోవచ్చని రవాణా నిపుణులు అన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సర్వే ప్రకారం హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ వద్ద గంటకు 10 వేలకు పైగా వాహనాలు వెళ్తున్నాయి. వాటిలో 6,550 వాహనాల్లో డ్రైవర్ ఒక్కరే ఉంటే, దాదాపు 3,500 వాహనాల్లో ఇద్దరు ఉన్నారు. హైటెక్ సిటీ ప్రధాన రోడ్డుపై రోజుకు సుమారు 1.5 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి.

సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో మాజీ సైంటిస్ట్-జి, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానింగ్ అండ్ ఇంజనీరింగ్ హెడ్ టి. సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, కొన్ని కారిడార్లలో హై-ఆక్యుపెన్సీ వెహికల్ (HOV) విధానాన్ని అమలు చేయవచ్చని అన్నారు. ముగ్గురు కంటే తక్కువ మంది ఉన్న కార్లకు పీక్ అవర్స్‌లో పరిమితులు లేదా అదనపు ఛార్జీ విధించవచ్చని, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలతో వాహనాలను గుర్తించి ఉల్లంఘనలపై చలాన్లు జారీ చేయవచ్చని ఆయన సూచించారు.

సింగపూర్ కంజెషన్ ప్రైసింగ్‌ను మొదటగా ప్రవేశపెట్టగా, లండన్, స్టాక్‌హోమ్, మిలాన్, ఓస్లో వంటి నగరాలు కూడా ఇలాంటి రోడ్ ఛార్జింగ్ పథకాలను అనుసరిస్తున్నాయని నిపుణులు గుర్తు చేశారు.