రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి రిస్క్ లేకుండా నెలవారీ ఖర్చుల కోసం రెగ్యులర్ ఇన్కమ్ కోరుకునే సీనియర్ సిటిజన్లకు పోస్టాఫీసు అందిస్తున్న 'సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్' (SCSS) ఒక అద్భుతమైన ఆప్షన్. కేంద్ర ప్రభుత్వ భద్రతతో కూడిన ఈ స్కీమ్ ప్రస్తుతం వార్షికంగా 8.2 శాతం ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తోంది. దేశంలోని ప్రముఖ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే మెరుగైన రాబడిని అందిస్తుండటంతో పాటు.. అసలు పెట్టుబడికి 100 శాతం గ్యారెంటీ ఉంటుంది.
ఈ పథకంలో గరిష్ఠంగా రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే ఏడాదికి రూ. 2లక్షల 46వేలు వడ్డీ ఆదాయం అందుకోవచ్చు. ఈ లెక్కన ప్రతి మూడు నెలలకోసారి రూ. 61వేల 500 చొప్పున ఖాతాలో జమ అవుతాయి. దీనిని నెలవారీగా లెక్కిస్తే సగటున నెలకు రూ. 20వేల 500 ఆదాయం వచ్చినట్లు అవుతుంది. అయితే వడ్డీ చెల్లింపులు మాత్రం నెలవారీగా కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి జరుగుతాయని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. ఒకవేళ రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ. లక్షా 23వేలు, రూ. 10 లక్షలు పెడితే ఏడాదికి రూ. 82వేలు వడ్డీ లభిస్తుంది.
ALSO READ | పెళ్లిళ్లకు వెడ్డింగ్ ఇన్సూరెన్స్.. ఏమేం కవర్ చేస్తుంది? ప్రీమియం ఎంత?
అర్హులైన సీనియర్ సిటిజన్లు కనీసం రూ. 1,000 నుంచి గరిష్ఠంగా రూ. 30 లక్షల వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ కూడా ప్రారంభించే వెసులుబాటు ఉంది. జాయింట్ ఖాతాలో కూడా గరిష్ఠ పరిమితి రూ. 30 లక్షలుగానే ఉంటుంది. ఈ స్కీమ్ కాలపరిమితి 5 సంవత్సరాలు.
రాబడితో పాటు టాక్స్ బెనిఫిట్స్ కూడా ఈ స్కీమ్‌లో ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ఏడాదికి రూ.లక్షా 50వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. తక్కువ రిస్క్‌తో ఆదాయం, పన్ను ప్రయోజనాలు కోరుకునే వృద్ధులకు పోస్టాఫీసు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఛాయిస్ అనే చెప్పుకోవాలి.
