ఇకపై ఆ సినీ జర్నలిస్ట్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు.. TFJA సంచలన నిర్ణయం

ఇకపై ఆ సినీ జర్నలిస్ట్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు.. TFJA సంచలన నిర్ణయం

టాలీవుడ్‌లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. సీనియర్ జర్నలిస్ట్ వేదుల సూర్యనారాయణ మూర్తి అలియాస్ దేవిప్రియ విషయంలో తెలుగు సినీ పాత్రికేయ సంఘం (TFJA) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆయనకు సినీ ప్రముఖులు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, సినిమా ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇతర ప్రచార కార్యక్రమాలకు ఆహ్వానించకూడదని సూచించింది. ఈ మేరకు నవంబర్ 23న తెలుగు సినీ పరిశ్రమకు అధికారిక లేఖలు జారీ చేసింది. TFJA తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సినీ ఇండస్ట్రీకి స్పష్టమైన సందేశం..

TFJA ఎగ్జిక్యూటివ్ బాడీ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. నిర్మాతలు, దర్శకులు, హీరోలు, హీరోయిన్లు, ఇతర చిత్ర బృంద సభ్యులు వేదుల మూర్తికి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా సహకరించాలని సంఘం కోరింది. సినిమా ప్రమోషన్లు, రిలీజ్ ఈవెంట్స్, ఇతర ప్రచార  కార్యక్రమాల్లోనూ ఆయనకు అవకాశం కల్పించవద్దని స్పష్టం చేసింది.

ప్రతి సినిమా విడుదల సమయంలో సంబంధిత చిత్ర బృందాలకు ఈ నిర్ణయాన్ని తెలియజేయాలని తన సభ్యులకు సూచించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వేదుల మూర్తిని ఎలాంటి సినిమా ప్రమోషనల్ ఈవెంట్లకు ఆహ్వానించకూడదని, సినీ పరిశ్రమకు సంబంధించిన ఇతర కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం కల్పించకూడదని తెలుగు సినీ పాత్రికేయ సంఘం (TFJA) ఫిల్మ్ ఫ్రటర్నిటీకి (Film Fraternity) అధికారిక నోటీసులు జారీ చేసింది.

TFJA అధ్యక్షుడు వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శి పి. రఘు, పొలిట్‌బ్యూరో కన్వీనర్ వి. లక్ష్మీనారాయణ సంతకాలతో ఈ లేఖలు విడుదలయ్యాయి. సంఘం నిర్ణయానికి సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

వివాదాలే కారణమా.. మరోసారి చర్చ..

వేదుల మూర్తి గతంలోనూ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. వేణుస్వామి ఇంటర్వ్యూ వివాదంతో పాటు, తోటి జర్నలిస్టులపై సోషల్ మీడియా వ్యాఖ్యల నేపథ్యంలో సస్పెన్షన్లకు గురైనట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, ఇంటర్వ్యూల్లో వ్యూస్ కోసం సినీ ప్రముఖులను ఇబ్బందికరమైన, ద్వంద్వార్థాలు వచ్చే ప్రశ్నలు అడుగుతున్నారనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. మంచు లక్ష్మితో ఇంటర్వ్యూ సైతం అప్పట్లో వివాదాస్పదమైంది.

అసలు కారణాలపై ఉత్కంఠ!

అయితే తాజా నిర్ణయం వెనుక ఉన్న నిర్దిష్ట కారణాలను TFJA తన అధికారిక లేఖల్లో వెల్లడించలేదు. దీంతో ఈ ఆదేశాలపై సినీ, మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే పలు వివాదాలతో వార్తల్లో ఉన్న వేదుల మూర్తి విషయంలో TFJA తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.