కోలీవుడ్ లో ఒకప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే తిరుగులేదు.. వీరిద్దరూ కలిశారంటే చార్ట్‌బస్టర్ సాంగ్స్ పక్కా అనే టాక్ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఓ స్టార్ ఈవెంట్‌కు ఒకరు హాజరుకాకపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ల వెడ్డింగ్ రిసెప్షన్‌కు హీరో ధనుష్ హాజరుకాకపోవడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. వీరిద్దరి మధ్య మళ్లీ విభేదాలు మొదలయ్యాయా? అనే సందేహాలు ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
నవంబర్ 11న గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అనిరుధ్, కావ్య మారన్ వివాహం చేసుకున్నారు. అనంతరం నవంబర్ 21న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, మహేశ్ బాబు తదితర సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఇంతమంది ప్రముఖులు వచ్చిన వేడుకలో ధనుష్ కనిపించకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
నిజానికి ధనుష్, అనిరుధ్ మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ధనుష్ నటించిన '3' సినిమాతోనే అనిరుధ్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలోని 'వై దిస్ కొలవెరి డి' పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 'వేలై ఇల్ల పట్టదారి', 'మారి', 'తంగమగన్' వంటి సినిమాలతో ఈ కాంబినేషన్ ఎన్నో హిట్ ఆల్బమ్‌లను అందించింది.
అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పెళ్లి రిసెప్షన్‌కు ధనుష్ రాకపోవడంతో ఆ వార్తలకు మళ్లీ బలం చేకూరినట్లయింది. మరోవైపు ధనుష్ ఆ సమయంలో మదురైలో ఉన్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. అసలు ఆయనకు ఆహ్వానం అందిందా? వచ్చినా ఎందుకు హాజరుకాలేదు? అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ధనుష్ కానీ, అనిరుధ్ కానీ ఈ ప్రచారంపై స్పందించలేదు. దీంతో వీరిద్దరి మధ్య ఏం జరుగుతోందన్న ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది. ..
