చలికాలంలో దగ్గు తగ్గడం లేదా..? రాత్రుళ్లు మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతుందా..? ఇలా చేస్తే బెటర్ !

చలికాలంలో దగ్గు తగ్గడం లేదా..? రాత్రుళ్లు మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతుందా..? ఇలా చేస్తే బెటర్ !

చలి కాలం వచ్చిందంటే చాలు. జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. చల్లని గాలి పడని వాళ్లను, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్లను జలుబు, దగ్గు చలికాలంలో ఇబ్బందిపెడుతుంటాయి. గొంతు నొప్పి, అలసట, ఛాతీలో పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కేవలం మందుల మీద మాత్రమే ఆధారపడకుండా లైఫ్ స్టైల్లో కొన్ని అలవాట్లను మార్చుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆహారపు అలవాట్లు

చలి కాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం ముఖ్యం. రోజంతా గోరువెచ్చని నీటిని తాగడం వల్ల గొంతు శుభ్రంగా ఉంటుంది, కఫం కరుగుతుంది. అల్లం, తులసి టీ, పసుపు పాలు, దాల్చిన చెక్క కషాయాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫ్రిజ్లోని చల్లని నీరు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీం వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎప్పుడూ తాజా, వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం వల్ల గొంతులో మంట తగ్గుతుంది.

వాతావరణం

చలికాలంలో గాలి పొడిగా ఉండటం వల్ల గొంతు ఎండిపోయి దగ్గు వస్తుంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు గదిలో హ్యూమిడిఫైయర్ వాడాలి. అది లేకపోతే నీటితో నిండిన గిన్నెను గదిలో ఉంచడం ద్వారా గాలిలో తేమను పెంచవచ్చు. దుమ్ము, ధూళి, పొగకు దూరంగా ఉండటం ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిది. విటమిన్-సీ ఎక్కువగా ఉండే ఉసిరి, నారింజ, జామ వంటి పండ్లను తీసుకోవాలి. తేనె, వెల్లుల్లి, అల్లం వంటి వాటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. వేపుళ్లు, జంక్ ఫుడ్ తినడం వల్ల శరీరంలో కఫం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ALSO READ : 40 ఏళ్ల తర్వాత పొట్ట పెరుగుతోందా?

ఇతర జాగ్రత్తలు

రోజుకు కనీసం ఒక్కసారి ఆవిరి పట్టడం వల్ల గొంతు వాపు తగ్గుతుంది, ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల గొంతులోని బ్యాక్టీరియా నశిస్తుంది. శరీరం త్వరగా కోలుకోవడానికి రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని నిపుణులు పేర్కొన్నారు. శారీరక శ్రమ తగ్గే ఈ కాలంలో నడక, యోగా, ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు బలంగా మారుతాయి. ఏవైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.