ఆలయాల ముందు అడుక్కుంటూనే.. దేవుడికి లక్షలు డొనేట్ చేస్తున్న వృద్ధురాలు

ఆలయాల ముందు అడుక్కుంటూనే.. దేవుడికి లక్షలు డొనేట్ చేస్తున్న వృద్ధురాలు

కోట్ల ఆస్తులున్న వారే రూపాయి విరాళం ఇవ్వడానికి వెనుకాడే ఈ రోజుల్లో.. పూట గడవడం కోసమే ఇతరులపై ఆధారపడే ఓ వృద్ధురాలు తన భక్తితో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆలయాల ముందు భిక్షాటన చేస్తూ పోగేసిన చిల్లర డబ్బులను తిరిగి ఆ దేవుడి సన్నిధికే సమర్పించి స్ఫూర్తిగా నిలిచారు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన గొర్లి నరసాయమ్మ. తన కడుపు నింపుకోవడానికి భక్తులు వేసే కాసులనే పొదుపు చేస్తూ.. ఆలయాల అభివృద్ధికి ఆమె చేస్తున్న విరాళాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.

చాలా ఏళ్ల క్రితం తిరుపతి నుంచి తునికి వలస వచ్చిన నరసాయమ్మ.. గత 30 ఏళ్లకు పైగా అక్కడి ఆలయాల వద్ద భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తునిలోని గొల్లపరావు సెంటర్ సమీపంలో ఉన్న శివాలయం ప్రాంగణమే ఆమెకు నివాసం. ప్రతిరోజూ ఉదయాన్నే గుడికి వచ్చే భక్తులు ఇచ్చే డబ్బులతో తన కనీస అవసరాలు తీర్చుకుంటూ.. మిగిలిన మొత్తాన్ని రూపాయి రూపాయి కూడబెట్టడం ఆమె అలవాటు. ఒకరోజు కలలో సాక్షాత్తూ పరమశివుడు కనిపించి, తనకు ఆశ్రయమిచ్చిన ఆలయాలకు సేవ చేయమని ఆదేశించినట్లు నరసాయమ్మ చెబుతుంటారు. ఆ దైవ ప్రేరణతోనే తాను దాచుకున్న సొమ్మును ఆలయాలకు విరాళంగా ఇవ్వడం ప్రారంభించారు.

నరసాయమ్మ చేసిన విరాళాల లిస్టు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. తునిలోని దారాలమ్మ ఆలయంలో భారీ త్రిశూలం తయారీ కోసం ఆమె రూ. లక్ష విరాళం అందించారు. అలాగే ఈ ఏడాది ఆలయ అభివృద్ధి పనుల కోసం మరో రూ.50 వేలు, కార్తీక మాసంలో తునిలోని అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయానికి రూ.50 వేలు సమర్పించారు. అంతేకాదు శ్రీశైలం భ్రమరాంబికా దేవి అమ్మవారికి బంగారు కళ్లను కానుకగా సమర్పించి తన భక్తిని చాటుకున్నారు. వీటితో పాటు మరో మూడు ఆలయాలకు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల చొప్పున డబ్బును విరాళాలు ఇచ్చారు. కేవలం ఆలయ నిర్మాణాలకే కాకుండా, భక్తుల ఆకలి తీర్చే అన్నదానం కోసం గతేడాది 4 బస్తాల బియ్యాన్ని కూడా అందించారు.

ALSO READ : హైదరాబాద్లో విషాదం.. గేటెడ్ కమ్యూనిటీలో సెప్టిక్ ట్యాంకులో క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి

తాను కష్టపడి యాచించిన సొమ్మును స్వార్థానికి వాడుకోకుండా తిరిగి దైవకార్యాలకు వినియోగిస్తున్న నరసాయమ్మపై ఆలయ కమిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. త్రిశూలం కోసం ఆమె అందించిన లక్ష రూపాయల విరాళాన్ని దారాలమ్మ ఆలయ అధ్యక్షుడు తిరుమలశెట్టి సత్తిబాబు, కార్యదర్శి పల్లెల నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. నేటికీ పూట గడవడానికి భక్తుల దయపైనే ఆధారపడుతూ.. తాను సంపాదించిన ప్రతి పైసాను దేవుడి సేవకే అంకితం చేస్తున్న నరసాయమ్మ నిస్వార్థ భక్తి అందరికీ గొప్ప సందేశాన్నిస్తోంది.