రైలు ప్రయాణికుడికి ఊహించని అనుభవం ఎదురైంది. తన టికెట్ కన్ఫామ్ అయినా, కోచ్ లోకి వెళ్లి చూస్తే తనకు కేటాయించిన సీటు నంబరే అక్కడ లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. వారణాసి నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే ట్రైన్‌లో వెళ్తున్న ప్రయాణికుడికి ఎదురైన ఈ వింత ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇషాన్ బాజ్‌పాయ్ అనే ప్రయాణికుడు వారణాసి సిటీ నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే 15132 నంబర్ గల ట్రైన్‌లో ప్రయాణిస్తున్నాడు. 2026 నవంబర్ 22న రాత్రి 10:45 గంటల సమయంలో బెర్త్ కన్ఫామ్ అయిందని వెళ్లి చూస్తే అక్కడ ఆ నెంబరుతో సీటు లేదని ఆశ్చర్యానికి గురయ్యాడు. ఏ1 కోచ్‌లో ఆయనకు 54వ నంబర్ బెర్తు కన్ఫామ్ అయింది. కోచ్ లోకి వెళ్లి సీటు కోసం వెతకగా, అక్కడ కేవలం 52 బెర్తులు మాత్రమే ఉన్నాయి.
కోచ్ లో లేని సీటు
తనకు కేటాయించిన 54వ నంబర్ సీటు లేకపోవడంతో ఇషాన్ ఇబ్బందికి గురయ్యాడు. రాత్రిపూట ప్రయాణం కావడంతో కన్ఫామ్ అయిన సీటు దొరక్కపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని వీడియో తీసి ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. తన టికెట్ ఫోటోను కూడా షేర్ చేశాడు. రైల్వే హెల్ప్‌లైన్ 139కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు ఇషాన్ చెప్పాడు. సోషల్ మీడియాలో రైల్వే శాఖను, రైల్వే మంత్రిని ట్యాగ్ చేస్తూ ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు.
రైల్వే శాఖ స్పందన
ఇషాన్ పోస్టుకు రైల్వే సేవా స్పందించింది. ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. సీట్లు కేటాయించే సిస్టమ్‌లో ఇలాంటి పొరపాటు ఎలా జరిగిందని సోషల్ మీడియా యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి కొన్ని ఘటనలు జరిగినట్లు కొందరు గుర్తు చేస్తున్నారు. సెకండ్ ఏసీ బుకింగ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా థర్డ్ ఏసీకి మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఒక ప్రయాణికుడు తన అనుభవాన్ని పంచుకున్నారు.
Travelling on Train 15132 tonight. My ticket confirms A1/54, but the coach has only 52 berths. Being left without your confirmed seat at 10:45 PM, on an overnight journey, is extremely frustrating. Complaint raised on 139. How can this happen? @RailwaySeva @RailMinIndia https://t.co/jSQty1K5PK
— Ishan Bajpai (@IshanBajpai09) November 22, 2026
