టిఫిన్ భోజనం ఇష్టమెుచ్చినప్పుడు తింటున్నారా? ఆయుష్షు ఆవిరైపోతుంది జాగ్రత్త!

టిఫిన్ భోజనం ఇష్టమెుచ్చినప్పుడు తింటున్నారా? ఆయుష్షు ఆవిరైపోతుంది జాగ్రత్త!

మనం తీసుకునే ఆహారంతో పాటు అది ఎప్పుడు తింటున్నామనేది కూడా మన ఆయుష్షును నిర్ణయిస్తుందని కొత్త అధ్యయనం వెల్లడించింది. రోజులో మొదటి భోజనం ఆలస్యంగా చేయడం, రాత్రి భోజనం అర్ధరాత్రి తర్వాత తినడం వల్ల మరణాల ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అమెరికాకు చెందిన 31వేల 044 మందిపై దాదాపు 20 ఏళ్ల పాటు జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలను యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రచురించింది.

పరిశోధనలో భాగంగా 40 ఏళ్లు పైబడిన వారి ఆహారపు అలవాట్లను విశ్లేషించారు. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య మొదటి భోజనం(టిఫిన్) చేసేవారితో పోలిస్తే.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత తినేవారికి మరణించే ముప్పు 29 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే టిఫిన్ చేసే గ్యాప్ పెరిగేకొద్దీ ఈ ప్రమాదం కూడా పెరుగుతున్నట్లు గుర్తించారు. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య తినేవారిలో 10 శాతం, 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు తినేవారిలో 19 శాతం ముప్పు పెరుగుతున్నట్లు అధ్యయనం పేర్కొంది.

టిఫిన్ లేట్ అయితే ముప్పే
ఉదయం లేచినప్పటి నుంచి ఏమీ తినకుండా డైరెక్టుగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత మొదటిసారి ఆహారం తీసుకునేవారిలో గుండె జబ్బులతో చనిపోయే ముప్పు 46 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. 50 ఏళ్ల వయసులో ఉన్నవారిని గమనిస్తే.. ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల వారి ఆయుష్షు సగటున 2.46 ఏళ్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. తెల్లవారుజామున 4 గంటల తర్వాత తీసుకునే క్యాలరీలు ఉన్న ఏదైనా ఫుడ్ అండ్ డ్రింక్స్ ని మొదటి భోజనంగా పరిశోధకులు పరిగణించారు.

రాత్రి భోజనం ఎప్పుడు చేయాలి?
రాత్రి పూట భోజనం ముగించే సమయం కూడా ఆయుష్షుపై ప్రభావం చూపుతోందని స్టడీలో తేలింది. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య భోజనం ముగించేవారితో పోలిస్తే.. అర్ధరాత్రి దాటిన తర్వాత తినేవారికి చనిపోయే ముప్పు 27 శాతం ఎక్కువగా ఉందట. వీరి ఆయుష్షు కూడా సగటున 2.35 ఏళ్లు తగ్గే ప్రమాదం ఉందని గుర్తించారు. అయితే రాత్రి 7 గంటల కంటే ముందే భోజనం ముగించే వారిలో కూడా మరణాల ముప్పు 13 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. రాత్రి 8 గంటల సమయంలో భోజనం ముగించేవారిలో మరణాల ముప్పు అత్యంత తక్కువగా ఉన్నట్లు డేటా చెబుతోంది. 

హువాజోంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్త జిలీ షాన్ ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. ఆహారం తీసుకునే సమయాల్లో మార్పులు రావడం వల్ల శరీరంలోని సర్కాడియన్ రిథమ్(జీవక్రియల గడియారం) దెబ్బతింటుందని వివరించారు. దీనివల్ల గ్లూకోజ్, లిపిడ్ మెటబాలిజంలో అస్థిరత ఏర్పడి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని చెప్పారు. 

అయితే ఈ ఫలితాలను ప్రాథమిక హెచ్చరికలుగానే చూడాలని జిలీ షాన్ సూచించారు. ఆలస్యంగా తినడం అనేది కేవలం అనారోగ్యానికి సంకేతం మాత్రమే కావచ్చునని, అది నేరుగా మరణానికి కారణమని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమని స్పష్టం చేశారు. క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు, సరైన నిద్ర పాటించడం ఆరోగ్యానికి ముఖ్యమని పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా 1999 నుంచి 2018 వరకు సేకరించిన డేటాను పరిశోధకులు విశ్లేషించారు.