ఫులేరా గ్రామంలో మళ్లీ సందడి మొదలైంది.. కానీ ఈసారి నవ్వులతో పాటు రాజకీయ వేడి కూడా గట్టిగానే ఉండబోతోంది. ఇన్నాళ్లూ సర్పంచ్ కుర్చీ చుట్టూ తిరిగిన కథ ఇప్పుడు కొత్త మలుపులు తీసుకోబోతోంది. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ, భావోద్వేగాలతో కట్టిపడేసిన పాపులర్ వెబ్ సిరీస్ 'పంచాయత్' ఐదో సీజన్‌తో తిరిగి వచ్చేస్తోంది. లేటెస్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సీజన్‌కు సంబంధించిన అధికారిక ట్రైలర్‌ను విడుదల చేసింది. దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోయింది. డిసెంబర్ 3, 2026 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
ఈసారి ఫులేరాలో అసలైన రాజకీయ రచ్చ మొదలైంది. గత ఎన్నికల్లో క్రాంతి దేవి (సునీతా రాజ్వర్) విజయం సాధించడంతో ఇన్నాళ్లూ సర్పంచ్‌గా చక్రం తిప్పిన మంజు దేవి (నీనా గుప్తా) అధికారం కోల్పోయారు. దీంతో కొత్త ప్రధాన్‌గా క్రాంతి దేవి బాధ్యతలు చేపట్టగా.. ఆమె భర్త బన్రాకస్ (దుర్గేష్ కుమార్) 'ప్రధాన్పతి'గా తన హవా చూపించేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు మాజీ ప్రధాన్‌జీ (రఘుబీర్ యాదవ్) అధికారం కోల్పోయి కొత్త పరిస్థితులకు అలవాటు పడలేక ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఫులేరాలో కుర్చీ మారింది కానీ, కష్టాలు మాత్రం తగ్గలేదు..
ఇక సచివ్జీ (జితేంద్ర కుమార్) పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. కొత్త నాయకత్వం కింద పని చేయడం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారినట్లు ట్రైలర్ సూచిస్తోంది. ఎంబీఏ చదివి ఫులేరా నుంచి బయటపడాలనే లక్ష్యంతో ఉన్న ఆయనకు గ్రామ రాజకీయాలు, స్నేహితులు, వ్యక్తిగత జీవితంలోని సమస్యలు అడ్డంకులుగా మారుతున్నాయి. ముఖ్యంగా రింకీ (సాన్విక)తో ఆయన ప్రేమకథలో అనూహ్యమైన మలుపులు చోటుచేసుకోనున్నాయి. వీరిద్దరి బంధం పెళ్లి పీటల వరకు వెళ్తుందా? లేక మరో ట్విస్ట్ ఎదురవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త ప్రధాన్పతి బన్రాకస్ పాలనలో సచివ్జీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారన్నది కీలకంగా చూపించారు... .
ఈ సీజన్లో ఫైజల్ మాలిక్ (ప్రహ్లాద్), చందన్ రాయ్ (వికాస్), అశోక్ పాఠక్ (బినోద్) తదితర పాత్రలు కూడా సందడి చేయనున్నాయి. గ్రామీణ రాజకీయాలు, చిన్నచిన్న గొడవలు, అమాయకపు మనుషుల మధ్య సాగే హాస్యం ఈసారి కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక ఈ సిరీస్ కు దిపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించారు. చందన్ కుమార్ రచన అందించారు.
టీవీఎఫ్ (TVF) నిర్మాణంలో తెరకెక్కిన ఈ సీజన్‌ను భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలు, ప్రాంతాల్లో వీక్షించవచ్చు. కథలో కొత్తదనం తీసుకొస్తూనే ఫులేరా సహజత్వాన్ని కాపాడటమే తమ ప్రయత్నమని దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా వెల్లడించారు. మరి ఈసారి ఫులేరా రాజకీయాల్లో ఎవరి హవా నడుస్తుంది? సచివ్జీకి ప్రేమలోనూ, కెరీర్లోనూ విజయం దక్కుతుందా? సమాధానాలు తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే...
