ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే పోలీసులు జరిమానా విధించడం సాధారణమే. అయితే కొన్ని సందర్భాల్లో వాహనాన్ని కూడా సీజ్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో చాలామందికి ఒక డౌట్ వస్తుంది. పోలీసులు ఏ కారణంతోనైనా వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చా? ఏ తప్పులు చేస్తే వాహనాన్ని సీజ్ చేస్తారు? ఒకవేళ పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటే తిరిగి ఎలా తెచ్చుకోవాలి? అనే విషయాలు చాలామందికి తెలియవు.
నిజానికి మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ పోలీసులకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. అయితే ప్రతి చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనకూ వాహనాన్ని సీజ్ చేసే అధికారం వారికి లేదు. ఏయే సందర్భాల్లో వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చు? అలా జరిగితే మనం ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ సందర్భాల్లో పోలీసులు వాహనాన్ని సీజ్ చేయవచ్చు?
మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 207 ప్రకారం, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ట్రాఫిక్ పోలీసులు లేదా అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సందర్భాల్లో వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉంటుంది.
ఆర్సీ లేదా పర్మిట్ లేకపోతే: వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) లేదా అవసరమైన పర్మిట్ లేకుండా నడిపితే చర్యలు తీసుకోవచ్చు.
డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా, మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడినా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 185 ప్రకారం చర్యలు తీసుకుంటారు. అవసరాన్ని బట్టి వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకోవచ్చు.
నంబర్ ప్లేట్ సరిగా లేకపోతే: రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోయినా, నంబర్ ప్లేట్‌ను మార్చినా లేదా నకిలీ నంబర్ ప్లేట్ ఉపయోగించినా చర్యలు తీసుకోవచ్చు.
ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తే: అతివేగంగా లేదా నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తే సెక్షన్ 184 కింద చర్యలు తీసుకోవచ్చు.
వాణిజ్య వాహనాల నిబంధనలు ఉల్లంఘిస్తే: సరైన పర్మిట్ లేకుండా వాహనం నడపడం, పరిమితికి మించి బరువు లేదా ప్రయాణికులను తీసుకెళ్లడం వంటి సందర్భాల్లో కూడా చర్యలు ఉంటాయి. అయితే ప్రతి ఉల్లంఘనకూ వాహనాన్ని సీజ్ చేయలేరు. సంబంధిత చట్ట నిబంధనలు, పరిస్థితులను బట్టి అధికారులు నిర్ణయం తీసుకోవాలి.
పోలీసులు వాహనాన్ని సీజ్ చేస్తే ఏం చేస్తారు?
పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అందుకు సంబంధించిన వివరాలను ఎంటర్ చేయాలి. సాధారణంగా ఒక స్వాధీన పేపర్ లేదా రసీదు (Seizure Memo) ఇస్తారు. అందులో వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్, వాహనాన్ని సీజ్ చేయడానికి కారణం, సమయం, ప్రదేశం వంటి వివరాలు ఉంటాయి. వాహనంలో ఉన్న వస్తువుల వివరాలను కూడా నమోదు చేయవచ్చు. ఆ తర్వాత స్వాధీనం చేసుకున్న వాహనాన్ని దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో లేదా ట్రాఫిక్ పోలీసులు కేటాయించిన యార్డులో భద్రపరుస్తారు.
సీజ్ చేసిన వాహనాన్ని తిరిగి ఎలా తెచ్చుకోవాలి?
పోలీసులు మీ వాహనాన్ని స్వాధీనం చేసుకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. చట్టపరమైన విధానాన్ని అనుసరించి తిరిగి తెచ్చుకోవచ్చు.
1. ముందుగా రసీదు తీసుకోండి
పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఇచ్చే రసీదు లేదా సీజ్ మెమోను జాగ్రత్తగా ఉంచుకోండి. అందులో కేసుకు సంబంధించిన వివరాలు ఉంటాయి. మీ వాహనంపై ఏవైనా చలాన్లు ఉన్నాయో లేదో పరివాహన్ అధికారిక పోర్టల్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు.
ALSO READ : హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఇక నుంచి కంజెషన్ ఛార్జీలు.. కారులో ఒక్కరే వెళ్తే..
2. అవసరమైన పేపర్స్ రెడీ చేసుకోండి
వాహనాన్ని విడుదల చేయించుకోవడానికి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.
*వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC)
*డ్రైవింగ్ లైసెన్స్ (DL)
*వాహన ఇన్సూరెన్స్ పేపర్లు
*పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్
*వాహన యజమాని గుర్తింపు కార్డు
*పోలీసులు ఇచ్చిన చలాన్ లేదా సీజ్ రసీదు
3. సంబంధిత కోర్టును ఆశ్రయించండి
మీ వాహనం విడుదలకు కోర్టు అనుమతి అవసరమైన సందర్భాల్లో సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాలి. అవసరమైన పేపర్స్ ఇచ్చి వాహనం విడుదల కోసం దరఖాస్తు చేసుకోవాలి. కేసు స్వభావం, ఉల్లంఘన తీవ్రతను బట్టి కోర్టు తగిన నిర్ణయం తీసుకుంటుంది. జరిమానా చెల్లించడం లేదా ఇతర షరతులు విధించే అవకాశం ఉంటుంది. తరువాత వాహనం విడుదలకు ఉత్తర్వులు జారీ చేయవచ్చు.
4. కోర్టు ఉత్తర్వులతో వాహనాన్ని తీసుకెళ్లండి
కోర్టు నుంచి విడుదల ఉత్తర్వులు వచ్చిన తర్వాత వాటిని, జరిమానా చెల్లించిన రసీదును తీసుకుని వాహనం ఉన్న పోలీస్ స్టేషన్ లేదా ట్రాఫిక్ యార్డుకు వెళ్లాలి. అక్కడ అధికారులు మీ పేపర్లు, కోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తారు. అవసరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత వాహనాన్ని మీకు అప్పగిస్తారు.
వాహనదారులు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి!
వాహనదారులకు కొన్ని ప్రత్యేక హక్కులు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే అనవసరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి.
డిజిటల్ డాక్యుమెంట్లు : మీ వాహనానికి సంబంధించిన RC, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి పేపర్లు DigiLocker లేదా mParivahan యాప్‌లో భద్రపరుచుకోవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఈ యాప్‌లలో చూపించే డిజిటల్ పేపర్స్ కూడా చెల్లుబాటు అవుతాయి. కేవలం ఒరిజినల్ పేపర్స్ చేతిలో లేవనే కారణంతోనే వాహనాన్ని సీజ్ చేయడం కరెక్ట్ కాదు.
వాహనాన్ని తిరిగి తీసుకునేటప్పుడు జాగ్రత్త: పోలీస్ స్టేషన్ లేదా యార్డ్ నుంచి వాహనాన్ని తీసుకునే ముందు దాన్ని పూర్తిగా చెక్ చేయండి. వాహనం బాడీ, టైర్లు, బ్యాటరీ, లోపల ఉన్న వస్తువులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఏదైనా నష్టం కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లండి.
కారణం లేకుండా ఇబ్బంది పెట్టకూడదు: సాధారణ చెకింగ్ పేరుతో వాహనం తాళాలు తీసుకోవడం లేదా టైర్లలో గాలి తీసేయడం వంటి చర్యలకు సంబంధించి అధికారులపై ప్రశ్నించవచ్చు. అయితే చట్టబద్ధమైన తనిఖీ లేదా సీజ్ ప్రక్రియలో తీసుకునే చర్యలను వేరుగా చూడాలి.
చివరిగా..ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత. అదే సమయంలో పోలీసులకు ఉన్న అధికారాలు, వాహనదారులకు ఉన్న హక్కులు కూడా ప్రతి ఒక్కరికీ తెలియాలి. పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అందుకు కారణాన్ని అడిగి తెలుసుకోండి. సంబంధిత రసీదు తీసుకోండి. చట్టపరమైన విధానంలోనే మీ వాహనాన్ని తిరిగి పొందండి. అవసరమైతే న్యాయవాది సలహా తీసుకోండి.
