హైదరాబాద్: హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన మరో చారిత్రక కట్టడం రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను పునరాభివృద్ధి పేరుతో కూల్చివేసిన దక్షిణ మధ్య రైల్వే (SCR).. తాజాగా నాంపల్లి రైల్వే స్టేషన్లోనూ పాక్షికంగా కూల్చివేతలు చేపట్టింది. స్టేషన్ ఆధునికీకరణ, పునరాభివృద్ధి పనుల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో నగరంలోని చారిత్రక కట్టడాల పరిరక్షణపై మరోసారి చర్చ మొదలైంది.
నాంపల్లి రైల్వే స్టేషన్‌ను కూల్చివేసే అవకాశం ఉందని గతంలోనే పౌరులు, వారసత్వ కట్టడాల పరిరక్షణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్వే దేశవ్యాప్తంగా చేపడుతున్న రైల్వే స్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా చారిత్రక భవనాలకు నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన చెందారు. తాజాగా నాంపల్లి స్టేషన్లో కూల్చివేతలు జరగడంతో వారి ఆందోళనలు నిజమయ్యాయి.
హెరిటేజ్ జాబితాలో లేకపోవడంతోనే కూల్చివేతలు
నాంపల్లి రైల్వే స్టేషన్ కూల్చివేతపై రైల్వే అధికారులను సంప్రదించగా.. ఈ స్టేషన్ చారిత్రక కట్టడాల పరిరక్షణ జాబితాలో లేదని తెలిపారు. అందువల్లే పునరాభివృద్ధి పనుల్లో భాగంగా కూల్చివేతలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ మాత్రం రక్షిత చారిత్రక కట్టడాల జాబితాలో ఉండటంతో అక్కడ పునరాభివృద్ధి పనులు చేపట్టడం లేదని దక్షిణ మధ్య రైల్వే అధికారి వెల్లడించారు.
నిజాం కాలంలో నిర్మాణం
నాంపల్లి రైల్వే స్టేషన్‌ను హైదరాబాద్-దక్కన్ స్టేషన్ అని కూడా పిలుస్తారు. నగర రైల్వే రవాణా వ్యవస్థలో ఇది అత్యంత కీలకమైన స్టేషన్‌గా గుర్తింపు పొందింది. ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలనా కాలంలో 1907లో ఈ స్టేషన్ నిర్మితమైంది. అప్పట్లో హైదరాబాద్ నగరాన్ని బొంబాయితో అనుసంధానించే ప్రధాన రైల్వే కేంద్రాల్లో ఇది ఒకటిగా ఉండేది. ప్రయాణికుల సౌకర్యార్థం నాంపల్లి సరాయి పేరుతో విశ్రాంతి భవనాన్ని కూడా ఏర్పాటు చేశారు. నిజాం పాలనలో నిర్మితమైన ఈ కట్టడాలు హైదరాబాద్ చారిత్రక వైభవానికి ప్రతీకలుగా నిలిచాయి.
హైదరాబాద్‌లో రైల్వే వ్యవస్థకు ఘన చరిత్ర
హైదరాబాద్‌లో రైల్వే వ్యవస్థ అభివృద్ధి క్రమంగా సాగింది. నగరంలో తొలిసారిగా వాడి-సికింద్రాబాద్ రైల్వే మార్గాన్ని నిర్మించారు. 1869లో ఈ మార్గానికి సర్వే నిర్వహించగా, 1871లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1874 అక్టోబర్ 9న ఈ మార్గాన్ని రైలు రాకపోకలకు ప్రారంభించారు. తొలుత గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే కంపెనీ ఈ మార్గాన్ని నిర్వహించింది.
చారిత్రక ఆధారాల ప్రకారం.. హైదరాబాద్‌లో రైల్వే మార్గాల నిర్మాణం కేవలం ప్రజా రవాణా కోసమే జరగలేదు. బ్రిటిష్ పాలకుల రాజకీయ, ఆర్థిక అవసరాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషించాయి. హైదరాబాద్‌లో బ్రిటిష్ సైనిక బలగాలు మోహరించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు రవాణా సౌకర్యాలు కల్పించడం వారికి ముఖ్యమైన అంశంగా ఉండేది.
ALSO READ : కూతురి పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షల నగదు, బంగారం బుగ్గిపాలు
మరోవైపు నిజాం పాలకులు కూడా ప్రజల ప్రయాణ అవసరాలు, ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రైల్వే వ్యవస్థ విస్తరణకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలో చర్చలు, సంప్రదింపుల అనంతరం 1883లో నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వేస్ (Nizam's Guaranteed State Railways) ఏర్పాటైంది. ఆ తర్వాత మరిన్ని రైల్వే మార్గాలు, స్టేషన్లు అభివృద్ధి చెందాయి. నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నిర్మాణం కూడా ఈ విస్తరణలో భాగంగా జరిగింది.
నిజాం కాలం నాటి నిర్మాణ శైలికి ప్రతీకలుగా నిలిచిన సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లలో మార్పులు చోటుచేసుకోవడంతో హైదరాబాద్ చారిత్రక వారసత్వ పరిరక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
