షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం...కూతురి పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షల నగదు, బంగారం బుగ్గిపాలు

షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం...కూతురి పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షల నగదు, బంగారం బుగ్గిపాలు

House Gutted in Short Circuit, ₹10 Lakh Cash and Gold Burnt in Basara

 
బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని రవీంద్రపూర్ కాలనీలో బుధవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా షేక్ ఇబ్రహీం నివాసంలో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని విలువైన వస్తువులు, నగదు, బంగారం సహా భారీ ఆస్తి నష్టం సంభవించింది.

బాధితుడు షేక్ ఇబ్రహీం తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో భద్రపరిచిన సుమారు రూ.10 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం, వెండి వస్తువులు మంటల్లో కాలిపోయాయి. అంతేకాకుండా కూతురి వివాహం కోసం కొనుగోలు చేసి ఉంచిన ఫర్నిచర్, బట్టలు, ఇతర పెళ్లి సామాగ్రి, టీవీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. పాస్‌పోర్ట్‌లు, పిల్లల విద్యా సర్టిఫికెట్లు, విలువైన పత్రాలు సైతం కాలిపోయాయని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బాసర సీఐ దీపక్, సర్పంచ్ వెంకటేష్ గౌడ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.బాసర మండల తహశీల్దార్ పవన్ చంద్ర ఆదేశాల మేరకు ఆర్ఐ అభిమన్యు, జీపీఓ శంకర్ బాధితుల ఇంటిని పరిశీలించి నష్ట వివరాలను తెలుసుకున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హామీ ఇచ్చారు.

ALSO READ : వేర్వేరు చోట్ల విద్యుత్ షాక్ తో నలుగురు ప్రాణాలు కోల్పోయారు

కూతురి వివాహం కోసం ఎంతో కష్టపడి సమకూర్చుకున్న నగదు, బంగారం, పెళ్లి సామాగ్రి కళ్లముందే బూడిద కావడంతో ఇబ్రహీం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.