చెన్నూరులో మంత్రి వివేక్ మార్నింగ్ వాక్.. ప్రజల సమస్యలపై ఆరా

చెన్నూరులో మంత్రి వివేక్  మార్నింగ్ వాక్.. ప్రజల సమస్యలపై ఆరా

మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ నిర్వహించారు. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో కాలినడకన పర్యటిస్తూ స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకుని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా విన్నారు.

మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, అంతర్గత రహదారులకు సంబంధించిన సమస్యలను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ ప్రాంతాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజలు విన్నవించిన సమస్యలపై మంత్రి వివేక్ వెంకటస్వామి తక్షణమే స్పందించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత మున్సిపల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, వార్డుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని భరోసా కల్పించారు. అనంతరం ఇటీవల అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.