- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
బేగంబజార్, వెలుగు: దేశ రక్షణతో పాటు ధర్మ పరిరక్షణలో సిక్కులు అత్యంత ప్రముఖ పాత్ర పోషించారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రాంచందర్‌రావు అన్నారు. గురునానక్ దేవ్ జీ మహారాజ్ 557వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో విశాల్ దివాస్ (కీర్తన్ దర్బార్) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ గురు సింగ్ సభ అశోక్ బజార్ గురుద్వారా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు సర్దార్ గురుచరణ్ సింగ్ బగ్గ, సికింద్రాబాద్ గురుద్వారా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు సర్దార్ కుల్దీప్ సింగ్ సలూజా సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.
ఇందులో కిషన్‌రెడ్డితో పాటు రాంచందర్‌రావు, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రౌండ్స్ లో ఉదయం ప్రారంభమైన కీర్తనలు సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా కొనసాగాయి. భారీ లంగర్‌లో వేలాది మందికి అన్నప్రసాదం అందించారు. పలువురు సిక్కులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ప్రధాన కార్యదర్శి సర్దార్ జోగేంద్ర సింగ్ చావ్లా, సర్దార్ రణ్‌బీర్ సింగ్ గాంధీ, తరణ్‌దీప్ సింగ్ భాటియా, మీడియా ఇన్‌ఛార్జి సర్దార్ సత్నాం సింగ్, జస్పాల్ సింగ్ పుటేజా, మంజీత్ సింగ్ పాలా, గురుదీప్ సింగ్ పాల్గొన్నారు.
