గ్రీన్ ట్యాంకర్ల పేరుతో నిర్వాహకుల అక్రమాలు.. నాలా నీటితో దందా!

గ్రీన్ ట్యాంకర్ల పేరుతో నిర్వాహకుల అక్రమాలు.. నాలా నీటితో దందా!
  • ఖాజాగూడ నాలా నుంచి ట్యాంకర్లలోకి ..
  • సీఎంసీ సెంట్రల్ మీడియన్​కి పోస్తుంది ఈ నీళ్లే ..
  • శుద్ధి చేయకుండానే గార్డెనింగ్‌‌, నిర్మాణ అవసరాలకు..

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎల్​నినో నేపథ్యంలో తాగునీటి అవసరాలకు కాకుండా ఇతర పనులకు శుద్ధి చేసిన మురుగు నీటిని వినియోగించాలని వాటర్​బోర్డు గ్రీన్​ట్యాంకర్లను ప్రారంభించగా..దానికి కొందరు నిర్వాహకులు గండి కొడుతున్నారు. ఏకంగా గ్రీన్‌‌ ట్యాంకర్లలో మురుగునీటిని సరఫరా చేస్తున్నారు. ఖాజాగూడలోని నాలా నుంచి నేరుగా మురుగు నీటిని ట్యాంకర్లలో నింపి గార్డెనింగ్‌‌, ల్యాండ్‌‌స్కేపింగ్‌‌, నిర్మాణ అవసరాలకు తరలిస్తున్నారు. అలాగే, సీఎంసీలోని సెంట్రల్ మీడియన్ కి ఈ మురుగునీటినే పోస్తున్నారు. 

సెంట్రల్ మీడియన్ ప్లాంట్స్ నిర్వహణ బాధ్యతలను చూస్తున్న ఏజెన్సీనే ఈ పనికి పాల్పడుతోంది. అయితే, ఇది నిన్న మొన్న మొదలైంది కాదని..ఎప్పటి నుంచో నడుస్తోందని, ఇటీవల గ్రీన్ ట్యాంకర్లను ఏర్పాటు చేయడంతో అందులోకి మోటార్లతో నాలాల నీటిని నింపుతూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ వ్యవహారంపై జలమండలి, సైబరాబాద్‌‌ మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ అధికారులు విచారణ చేపట్టారు.